హైదరాబాద్ ఎంపీగా గెలుస్తా.. న్యాయం చేస్తా: బీజేపీ అభ్యర్థి మాధవి లత
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 3:53 AM GMTహైదరాబాద్ ఎంపీగా గెలుస్తా.. న్యాయం చేస్తా: బీజేపీ అభ్యర్థి మాధవి లత
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈసారి ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పగా.. ఇండియా కూటమి నేతలు మాత్రం భిన్నంగా మాట్లాడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవుతాయని చెబుతున్నారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈసారి మాధవి లత అవకాశం దక్కించుకుని ముమ్మరంగా ప్రచారం చేశారు. ఆమె హిందూత్వ వాదంతో అందరినీ ఏకం చేశారని చెప్పడంలో సందేహం లేదనే చెప్పాలి. ఏదీ ఏమైనా తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ స్థానానికి ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ నుంచి గతంలో పలుమార్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ గెలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఆయన గెలుపు ఖాయమని పలు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థి మాధవి లత మాత్రం తామే గెలుస్తామని అంటున్నారు.
ఈ క్రమంలోనే ఎన్నికల కౌంటింగ్ రోజు ఉదయమే లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఫలితాల కోసం ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు. బీజేపీ సానుభూతిపరులతో పాటు దేశం మొత్తం హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నికల ఫలితంపై ఆసక్తిగా ఎదురుచూస్తోందని అన్నారు. హైదరాబాద్ లోక్‌సభ నుంచి బీజేపీ గెలుస్తుందనీ.. తద్వారా హైదరాబాద్‌కు న్యాయం చేస్తామని ఎంపీ అభ్యర్థి మాధవి లత అన్నారు. రెండు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేందర మోదీ దేశ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. దేశం మొత్తం మళ్లీ ఆయనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారనీ.. ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని కూడా మాధవి లత చెప్పారు.