బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం, మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

మూడ్రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని ట్రాఫిక్‌ పోలీసులు

By Srikanth Gundamalla  Published on  8 July 2024 8:18 AM IST
restrictions

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం, మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం ఘనంగా జరుగనుంది. దాంతో..మూడ్రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. కల్యాణం జరిగే తొమ్మిదో తేదీ, రథోత్సవం నిర్వహించే 10న భక్తులు పెద్ద ఎత్తున బల్కంపేట ఆలయానికి తరలివస్తారు. ఈ క్రమంలోనే ఇవాళ్టి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు వాహనదారులు దారి మళ్లింపులను గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచిస్తున్నారు.

గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వైపు వాహనాలను ఎస్సాఆర్‌నగర్ టి-జంక్షన్ వద్ద మళ్లించి ఎస్సార్‌నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకేగూడ ఎక్స్‌ రోడ్డు, శ్రీరామ్‌నగర్‌ క్రాస్‌రోడ్డు, సనత్‌నగర్‌ మీదుగా ఫతేనగర్‌ రోడ్డు వైపు అనుమతించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గ్రీన్‌ల్యాండ్స్‌–బకుల్‌ అపార్ట్‌మెంట్స్, ఫుడ్‌వరల్డ్‌ నుంచి వచ్చే వాహనాలను బల్కంపేట వైపు అనుమతించరు. ఫుడ్‌వరల్డ్‌ ఎక్స్‌ రోడ్డులో సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రివనం లేదా ఎస్‌ఆర్‌నగర్‌ టి–జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.

బేగంపేట కట్టమైసమ్మ దేవాలయం నుంచి వచ్చే వాహనాలు బల్కంపేట వైపు వెళ్లడానికి అనుమతి ఉండదని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ఆ ట్రాఫిక్‌ను గ్రీన్‌ల్యాండ్స్, మాతా ఆలయం, సత్యం థియేటర్, ఎస్‌ఆర్‌నగర్‌ టి–జంక్షన్‌ ఎడమ మలుపు నుంచి ఎస్‌ఆర్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌ వైపు మళ్లిస్తారు. అలాగే.. ఎస్‌ఆర్‌నగర్‌ టి–జంక్షన్‌ నుంచి ఫతేనగర్‌ వరకు బైలేన్లతో పాటు లింక్‌ రోడ్లు మూసివేస్తారు.

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ ఏర్పాట్లను చేశారు అధికారులు. ఎస్‌ఆర్‌నగర్‌ టి–జంక్షన్‌ సమీపంలో ఆర్‌అండ్‌బీ కార్యాలయం, నేచర్‌క్యూర్‌ హాస్పిటల్‌ రోడ్డు సైడ్‌ పార్కింగ్, ఫుడ్‌వరల్డ్‌ ఎక్స్‌రోడ్డు సమీపంలోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, ఫతేనగర్‌ రైల్వే వంతెన కింద పార్కింగ్‌ ప్రాంతాలను గుర్తించారు.

Next Story