గంజాయిని పట్టించండి.. రూ.2లక్షలు రివార్డు అందుకోండి..!
వంద కిలోల గంజాయిని పట్టిస్తే రూ.2లక్షలు బహుమతి ఇస్తామని యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయిచైతన్య ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 4 July 2024 9:39 AM ISTగంజాయిని పట్టించండి.. రూ.2లక్షలు రివార్డు అందుకోండి..!
తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు ప్రభుత్వం, పోలీసులు. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. గంజాయి రవాణా చేస్తున్నవారిని పట్టుకుని జైలుకు పంపిస్తున్నారు. అయినా కూడా అక్రమదారులు గంజాయిని విక్రయించడం.. రవాణా చేయడం మాత్రం ఆపడంలేదు. తాజాగా వంద కిలోల గంజాయిని పట్టిస్తే రూ.2లక్షలు బహుమతి ఇస్తామని యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయిచైతన్య ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
బుధవారం సికింద్రాబాద్ నార్త్‌జోన్ డీసీపీ ఆఫీసులో ఎస్పీ సాయి చైతన్య మీడియాతో మాట్లాడారు. డగ్స్, గంజాయికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా టోల్‌ఫ్రీ నంబర్ 87126 71111కు కాల్ చేయాలన్నారు. అలాగే tsnabho-hyd@tspolice.gov.in , tsnabho-hyd@tspolice.gov.inకు మెయిల్ చేయవచ్చని కూడా చెప్పారు.
అయితే.. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమ్, ప్రణయ్, రోహన్ విలియమ్స్ ఈజీ మనీ కోసం గంజాయి విక్రయించడం మొదలుపెట్టారని పోలీసులు తెలిపారు. విద్యార్థులే టార్గెట్‌గా గంజాయి అమ్మడం మొదలుపెట్టారు. వీరితో పాటు గజంయాఇ కొంటున్న బోయిన్‌పల్లికి చెందిన భరణి కుమార్, పద్మారావునగర్‌కు చెందిన రోహన్ సింగ్, జూబ్లీహిల్స్‌కు చెందిన నారాయణరెడ్డి, నిఖిల్‌రెడ్డి, సూర్యతేజ, బంజారాహిల్స్‌కు చెందిన అర్జున్ చౌదరి, రాయదుర్గం, మలక్‌పేటకు చెందిన సాయిచరణ్‌రెడ్డి, సాయి పృథ్వినాథ్‌రెడ్డి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సాయి చైతన్య చెప్పారు. తమకు వచ్చిన సమాచారం మేరకు గంజాయికి అలవాటు పడ్డ 20 మంది విద్యార్థులను గుర్తించినట్లు ఎస్పీ చెప్పారు. గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలనీ.. తద్వారా విద్యార్థుల ఆరోగ్యాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.