తక్కువ ఛార్జీలకు వ్యతిరేకంగా ఓలా, ఉబర్, రాపిడో క్యాబ్ డ్రైవర్లు నిరసన తెలుపుతున్నందున రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) సిబ్బంది ప్రయాణీకులకు ఒక కీలక సలహా జారీ చేసింది. అడ్వైజరీలో భాగంగా క్యాబ్‌ల కొరత ఏర్పడే అవకాశం ఉందని, దీని వలన ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుందని తెలిపింది.
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) ప్రకారం.. అగ్రిగేటర్ కంపెనీలు విధించిన తక్కువ ఛార్జీలు క్యాబ్ డ్రైవర్ల ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. న్యాయమైన ఛార్జీలను అమలయ్యే చేయాలని ప్రభుత్వానికి, రవాణా శాఖకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, ఎటువంటి నిర్ణయాత్మక చర్యలు తీసుకోలేదని యూనియన్ ఆరోపించింది.
TGPWU వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ అగ్రిగేటర్ కంపెనీలు నగరం నుండి విమానాశ్రయానికి ప్రయాణానికి రూ. 300–రూ. 400 వరకు తక్కువగా వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ఓలా, ఉబర్, రాపిడో క్యాబ్ డ్రైవర్లు తమ డిమాండ్లు నెరవేరే వరకు హైదరాబాద్ విమానాశ్రయానికి ప్రయాణాలను తిరస్కరించడం ప్రారంభించారని యూనియన్ తెలిపింది.