Hyderabad: బేగంపేట్ రన్‌వే కింద అండర్‌పాస్.. 8 నెలల్లో పూర్తయ్యే ఛాన్స్!

హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా బేగంపేట ఎయిర్‌పోర్టు రన్‌వే కింద అండర్‌పాస్ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పచ్చజెండా ఊపింది.

By -  అంజి
Published on : 11 April 2026 11:15 AM IST

Begumpet Airport Underpass, HMDA, Hyderabad Infrastructure, Paradise Junction to Dairy Farm Road, AAI Approval, New Development Bank (NDB) Funding, Secunderabad Traffic Relief, Elevated Corridor Hyderabad

Hyderabad: బేగంపేట్ రన్‌వే కింద అండర్‌పాస్.. 8 నెలల్లో పూర్తయ్యే ఛాన్స్!

హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా బేగంపేట ఎయిర్‌పోర్టు రన్‌వే కింద అండర్‌పాస్ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పచ్చజెండా ఊపింది. పారడైజ్ జంక్షన్ నుండి మిలిటరీ డైరీ ఫామ్ రోడ్ (NH-44) వరకు ప్రతిపాదించిన 5.4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌లో ఈ అండర్‌పాస్ అత్యంత కీలకమైన భాగం. విమానయాన భద్రతా నిబంధనల దృష్ట్యా రన్‌వే సమీపంలో ఫ్లైఓవర్ నిర్మించడం సాధ్యం కాకపోవడంతో, 600 మీటర్ల పొడవుతో ఆరు వరుసల భూగర్భ మార్గాన్ని నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ పనులను విమాన రాకపోకలకు ఆటంకం కలగకుండా కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే చేపట్టేందుకు అనుమతి లభించింది.

ఈ ప్రాజెక్టును హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) పర్యవేక్షిస్తోంది. పనులు ప్రారంభమైన ఎనిమిది నెలల్లోగా దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవేళ ఏవైనా జాప్యం జరిగితే మరో రెండు మూడు నెలల అదనపు సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ అండర్‌పాస్ పూర్తయితే సికింద్రాబాద్, తడ్‌బండ్, బోయిన్‌పల్లి వంటి రద్దీ ప్రాంతాల మీదుగా ప్రయాణించే వారికి ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి. ముఖ్యంగా తడ్‌బండ్ ప్రాంతంలో ఉన్న ప్రమాదకరమైన మలుపులు తొలగిపోయి, వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతాయి.

ఈ భారీ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన 42 ఎకరాల భూమితో పాటు, 13 ఎకరాల ప్రైవేట్ భూమిని సేకరిస్తున్నారు. మొత్తం రెండు కారిడార్ల కోసం (పారడైజ్ నుండి శామీర్‌పేట మరియు పారడైజ్ నుండి డైరీ ఫామ్ రోడ్) కలిపి సుమారు 114 ఎకరాల రక్షణ భూమి, 78 ఎకరాల ప్రైవేట్ భూమి అవసరమవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 5,106 కోట్లు కాగా, ఇందులో 70 శాతం అంటే రూ. 3,574 కోట్లను న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (NDB) రుణంగా అందిస్తోంది. మిగిలిన రూ. 1,532 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.

Next Story