Hyderabad: మియాపూర్‌, చందానగర్‌ పరిధిలో 144 సెక్షన్‌

హైదరాబాద్‌ పరిధిలోని మియాపూర్‌లో హెచ్‌ఎండీఏ భూముల ఆక్రమణకు జనం యత్నించారు.

By Srikanth Gundamalla  Published on  23 Jun 2024 8:00 AM GMT
Hyderabad, 144 section,  miyapur, hmda land,

Hyderabad: మియాపూర్‌, చందానగర్‌ పరిధిలో 144 సెక్షన్‌ 

హైదరాబాద్‌ పరిధిలోని మియాపూర్‌లో హెచ్‌ఎండీఏ భూముల ఆక్రమణకు జనం యత్నించారు. ఈనేపథ్యంలో దీప్తిశ్రీనగర్‌లో పోలీసులు భారీగా మోహరించారు. మదీనాగూడలోని సర్వే నెంబర్ 100, 101లో ఉన్న స్థలంలో ఇళ్ల లేదా పట్టాలు ఇవ్వాలంటూ ఆక్రమణదారులు డిమాండ్ చేస్తున్నారు. దాంతో.. ప్రభుత్వ స్థలంలో ఎవరికీ అనుమతి లేదంటూ నిన్నటి నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. తాజాగా పోలీసలు మియాపూర్, చందానగర్ పీఎస్‌ పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు సీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 29 తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆయన వెల్లడించారు.

ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పేద ప్రజలు డిమాండ్ చేస్తూ హెచ్‌ఎండీఏ భూములను ఆక్రమించేందుకు శనివారం ప్రయత్నం చేశారు. దాంతో.. ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పైన పేర్కొన్న సర్వే భూములను ఎప్పటి నుంచో కబ్జా చేయాలని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హెచ్‌ఎండీఏ అడ్డుకుంటూ వస్తోంది. ఈ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. దాంతో.. నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనాలు చేరుకున్నారు. శుక్రవారం నుంచే వేల మంది హెచ్‌ఎండీఏ ఆధీనంలో ఉన్న భూముల్లోనికి వచ్చి తమకు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. ఈవిషయం తెలుసుకున్న అధికారులు స్థానిక పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ స్థలం అనీ.. వదిలేసి పోవాలని చెప్పారు. కానీ.. జనాలు మాత్రం వెనక్కి వెళ్లకుండా అక్కడే కూర్చొన్నారు. వారిని పంపే క్రమంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

ఇక భూములు పంచుతున్నారని సంగీత అనే మహిళతో పాటు మరికొందరు ప్రజలను రెచ్చగొట్టారని పోలీసులు గుర్తించారు. స్థానిక ఫంక్షన్ హాళ్లలో మీటింగ్‌లు పెట్టారని తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు పది మంది పై కేసులు నమోదు చేశారు. సంగీత, సీత, సంతోష్ తోపాటు మరో ఏడుగురి పై కేసులు నమోదు అయ్యాయి. ఇక మరోవైపు పోలీసులపై రాళ్లు రువ్వినవారిపైనా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం నేరమని డీసీపీ వినీత్ తెలిపారు. చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇంకా కొందరు హెచ్‌ఎండీఏ స్థలంలోనే ఉన్నారనీ.. స్థలం కావాలంటూ గొడవ చేస్తున్నారని చెప్పారు. ఈ మేరకు వాళ్లు వెనక్కి వెళ్లిపోవాలంటూ డీసీపీ వినీత్‌ హెచ్చరించారు.

Next Story