Hyderabad: కుళాయిలకు మోటార్లు పెడితే రూ.5,000 జరిమానా.. అధికారుల ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్ నగరవ్యాప్తంగా తాగునీటి సరఫరాలో నెలకొన్న అసమానతలను తొలగించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) నడుం బిగించింది.
By - అంజి |
Hyderabad: కుళాయిలకు మోటార్లు పెడితే రూ.5,000 జరిమానా.. అధికారుల ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్ నగరవ్యాప్తంగా తాగునీటి సరఫరాలో నెలకొన్న అసమానతలను తొలగించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) నడుం బిగించింది. ఇంటి కుళాయిలకు అక్రమంగా మోటార్లు అమర్చి నీటిని లాగే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఒక ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. నగరంలోని అందరికీ సమానంగా నీరు అందాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
వేసవిలో భూగర్భ జల మట్టాలు పడిపోవడంతో ప్రజలు పైప్‌లైన్ నీటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే, చాలా ప్రాంతాల్లో నీరు తక్కువ ఒత్తిడితో వస్తోందని ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన జలమండలి అధికారులు.. ఇది నీటి కొరత వల్ల కాదని, కొంతమంది వినియోగదారులు అక్రమంగా మోటార్ పంపులు వాడటం వల్ల ఏర్పడిన సమస్య అని గుర్తించారు. సాధారణ మోటార్లతో పాటు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన ఆటోమేటిక్ హై-స్పీడ్ మోటార్ల వల్ల పైప్‌లైన్ నుండి నీరు వేగంగా లాగబడుతోంది. దీనివల్ల మోటార్లు లేని సుమారు 60 శాతం మంది వినియోగదారులకు నీరు అందకుండా పోతోంది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి జోన్లలో ఈ తనిఖీలను ముమ్మరం చేయనున్నారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు లైన్‌మెన్ల నుండి సీనియర్ అధికారుల వరకు అందరూ 'బస్తీ బాట' కార్యక్రమంలో భాగంగా నీటి సరఫరా సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. కుళాయిల వద్ద నీటి ఒత్తిడిని గమనిస్తూ ఎక్కడైనా మోటార్లు వాడుతున్నట్లు తేలితే వెంటనే ఆ పరికరాలను స్వాధీనం చేసుకుంటారు. అంతేకాకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వారికి ₹5,000 జరిమానా విధిస్తారు.
దూర ప్రాంతాల నుండి ఎంతో వ్యయప్రయాసల కోర్చి నగరానికి తెస్తున్న నీరు అందరికీ సమానంగా అందాలని జలమండలి స్పష్టం చేసింది. అక్రమ మోటార్ల వాడకం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోందని, ఇది ఇతరుల హక్కును కాలరాయడమేనని ఎండీ హెచ్చరించారు. వేసవి పొడవునా ఈ తనిఖీలు కొనసాగుతాయని, ప్రజలు అక్రమ పద్ధతులను వీడి జలమండలికి సహకరించాలని అధికారులు కోరారు.