హైదరాబాద్: బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) పరిధిలోని అన్ని పార్కులు, రెస్టారెంట్లు, తదితర సందర్శన స్థలాలను ఈ నెల 14వ తేదీన మూసివేయనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని.. కొత్త సచివాలయం సమీపంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌ఎండీఏ తెలిపింది.
హెచ్‌ఎండీఏ ప్రకటన ప్రకారం.. రేపు ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్క్, పిట్ స్టాప్, సంజీవయ్య పార్క్, జల విహార్, అమోఘం రెస్టారెంట్ మూతపడనున్నాయి.
మరోవైపు అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణకు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ తీరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. విగ్రహా ఆవిష్కరణ అనంతరం.. ఐమాక్స్ పక్కనే ఉన్న మైదానంలో బహిరంగ సభ జరగనుంది. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్, విగ్రహావిష్కరణ అనంతరం, అంబేద్కర్ విగ్రహాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలు సందర్శించనున్నందున క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.