మరోసారి భారీ భూవేలానికి సిద్ధమవుతోన్న హెచ్‌ఎండీఏ

మోకీల ఫేజ్‌-2 భూముల వేలానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on  14 Aug 2023 4:32 PM IST
HMDA, Hyderabad, plots, e Auction ,

మరోసారి భారీ భూవేలానికి సిద్ధమవుతోన్న హెచ్‌ఎండీఏ

హైదరాబాద్‌ నగర్‌ శివారుల్లో మరో భారీ భూవేలానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో భూవేలం నిర్వహించనన్నారు అధికారులు. ఈ మేరకు మోకీల ఫేజ్‌-2 భూముల వేలానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. 300 ప్లాట్లలో 98,975 గజాలను ఈ సారి అమ్మకానికి పెడుతోంది. ఈ లేఔట్‌లో 300 నుంచి 500 గజాల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ కల్పించినట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు. రూ.1,180 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

వేలంలో పాల్గొనాలని అనుకునే వారు రూ.లక్ష డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. మోకీల ఫేజ్‌-2లో చదరపు గజానికి రూ.25వేలుగా కనీస ధర నిర్ణయించింది హెచ్‌ఎండీఏ. ఇందులోని మొత్తం 98,975 గజాల అమ్మకంతో ప్రభుత్వానికి దాదాపుగా రూ.800 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మోకిల ప్లాట్లు తొలి వడత వేలంలో గరిష్టంగా గజానికి రూ.1.05 లక్షలు పలికాయి. కనిష్టంగా అయితే గజానికి రూ.75వేలు పలికాయి. రెండో విడతలో రేట్లు మరింత ఎక్కువగా పలికే చాన్స్‌ ఉందని హెచ్‌ఎండీఏ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక అంతకుముందు కోకాపేటలో నిర్వహించిన భూముల వేలంలో ఎకారానికి రూ.100కోట్లకు పైగా వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బుద్వేల్‌లో జరిగిన వేలంలో కూడా మంచి ధరే లభించింది.

Next Story