జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి: హైకోర్టు
జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం వల్లే నాలుగేళ్ల బాలుడి ప్రాణం బలిగొందని, ఆదివారం వీధి కుక్కలు కొట్టి చంపేశాయని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది.
By అంజి Published on 23 Feb 2023 9:00 PM ISTగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్‌ఎంసీ ) నిర్లక్ష్యం వల్లే నాలుగేళ్ల బాలుడి ప్రాణాలు పోయాయని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆదివారం నాడు వీధికుక్కలు నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసి చంపిన ఘటనపై గురువారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)పై తీవ్ర స్థాయిలో మండిపడింది. అంబర్‌పేట్‌లోని గోల్నాక ప్రాంతంలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్ మృతి చెందాడన్న వార్తలపై స్పందించిన హైకోర్టు బుధవారం ఈ వ్యాజ్యాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. గురువారం విచారణ ప్రారంభించిన హైకోర్టు బాలుడి హత్య 'తీవ్ర బాధాకరం' అని పేర్కొంది. నగరంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే జీహెచ్‌ఎంసీ ఏం చేస్తుందో చెప్పాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఈ ఘటనకు కార్పొరేషన్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలను గురించి వివరించాలని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ, అంబర్‌పేట ఏరియా జీహెచ్‌ఎంసీ అధికారికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. బాలుడి కుటుంబానికి పరిహారం చెల్లించడం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు మార్చి 16కి వాయిదా వేసింది.