Hyderabad: మాజీ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ.. కాల్పుల కలకలం.. ఐదుగురికి డ్రగ్ టెస్టులో పాజిటివ్!

హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో అర్థరాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీ, కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

By -  అంజి
Published on : 15 March 2026 8:04 AM IST

Moinabad Farmhouse Raid, Pilot Rohit Reddy Drug Case, Hyderabad Drug Party News, Eagle Team Raid, Namith Mishra Firing, BMR Farmhouse Aziznagar, Telangana Drug Bust 2026

Hyderabad: మాజీ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ.. కాల్పుల కలకలం.. ఐదుగురికి డ్రగ్ టెస్టులో పాజిటివ్!

హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో అర్థరాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీ, కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.హైదరాబాద్ నగర శివారులోని అజీజ్‌నగర్ ప్రాంతంలో ఉన్న బీఎంఆర్ (BMR) ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఈ ఫామ్‌హౌస్‌లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు 'ఈగల్ టీం'కు సమాచారం అందడంతో ఎస్‌ఓటీ (SOT), లోకల్ పోలీసులు రంగంలోకి దిగారు. రాత్రి 9:30 గంటల సమయంలో పోలీసులు ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించగానే.. అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ మిశ్రా, రితేష్ రెడ్డికి చెందిన తుపాకీతో ఒక రౌండ్ గాలిలోకి కాల్పులు జరపడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

అయితే పోలీసులు వెంటనే చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో రాజకీయ, వ్యాపార, రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన మొత్తం 10 మంది పట్టుబడ్డారు. ఇందులో తొమ్మిది మంది పురుషులు కాగా, ఒకరు మహిళ. వీరిలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కూడా ఉన్నట్లు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ వెల్లడించారు. పోలీసులు అక్కడ ప్రాథమికంగా డ్రగ్ టెస్ట్ కిట్‌ల ద్వారా పరీక్షలు నిర్వహించగా.. పైలెట్ రోహిత్ రెడ్డి, నమిత్ మిశ్రా, రితేష్ రెడ్డి, కాసిక్ రవి, అర్జున్ రెడ్డి అనే ఐదుగురికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ అని తేలింది. వారం కిందటే తాము సిమ్లా, గోవా పర్యటనల నుంచి వచ్చామని, అక్కడ సేవించి ఉండవచ్చని పట్టుబడిన వారు చెబుతున్నట్లు సమాచారం.

పోలీసులు అర్థరాత్రి 2 గంటల వరకు తనిఖీలు కొనసాగించి, ఘటనా స్థలం నుంచి మద్యం సీసాలతో పాటు సుమారు 2 గ్రాముల 'వైట్ పౌడర్'ను (డ్రగ్స్ అని అనుమానిస్తున్న) సీజ్ చేశారు. కాల్పులు జరిపిన తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన ఐదుగురిని తదుపరి పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. వీరి రక్త నమూనాలను ఎఫ్‌ఎస్ఎల్ (FSL) ల్యాబ్‌కు పంపిస్తామని, రిపోర్టు ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ స్పష్టం చేశారు. ఈ ఘటనలో ప్రముఖ రాజకీయ నేతలు ఉండటంతో ఈ కేసు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story