ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను అందుకే సస్పెండ్ చేశారు

Here is why Banjara Hills SHO was suspended after pub raid.హైదరాబాద్‌లోని ఎలైట్ పబ్ పుడ్డింగ్ & మింక్‌లో ఏప్రిల్ 3న

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 April 2022 5:54 AM GMT
ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను అందుకే సస్పెండ్ చేశారు

హైదరాబాద్‌లోని ఎలైట్ పబ్ పుడ్డింగ్ & మింక్‌లో ఏప్రిల్ 3న అర్ధరాత్రి పోలీసులు దాడి చేసి ఐదు గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకుని 150 మందికి పైగా అదుపులోకి తీసుకున్న సంఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. అయితే, బంజారాహిల్స్ స్టేట్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) పి. శివ చంద్రను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ చర్య తీసుకోవడం కూడా ప్రజల దృష్టిని ఆకర్షించింది. దీనిపై ప్రజలు తమకు తోచినట్లుగా కామెంట్లు చేస్తున్నారు.

ఎస్‌హెచ్‌ఓను సస్పెండ్ చేసిన హైదరాబాద్ పోలీస్ చీఫ్ చర్యను పలువురు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. వీఐపీ క్లబ్‌పై దాడి చేసినందుకే ఆయనను సస్పెండ్ చేశారని కొందరు ఆరోపించారు.

అదుపులోకి తీసుకున్న 150 మందిలో మెగా కుటుంబ సభ్యురాలు, టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల, గాయకుడు, బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్, కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమారుడు అరవింద్ కుమార్ యాదవ్, టీడీపీ ఎంపీ కుమారుడు సిద్దార్థ గల్లా, ఆంధ్రాలో పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి బంధువు కూడా ఉన్నారనే వార్తలు వచ్చాయి. అనేక ఇతర వ్యాపారవేత్తలు, నలుగురు విదేశీ పౌరులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కేసు దర్యాప్తులో భాగమైన సీనియర్ IPS అధికారి న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు, హైదరాబాద్ CP CV ఆనంద్ పదేపదే సమావేశాలు నిర్వహించి హైదరాబాద్ లో డ్రగ్స్ ను అరికట్టాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. అలాంటి వాటిని అరికట్టడంలో విఫలమైనందున SHO ను సస్పెండ్ చేశారు. తన పరిధిలోని పబ్‌లపై బంజారాహిల్స్ పోలీసులు నిఘా పెట్టి ఉండాల్సింది. ఆ స్థలం స్టేషన్‌కు చాలా దూరంలో లేదు.. ఎస్‌హెచ్‌ఓ వైఫల్యం, అప్రమత్తంగా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అతని సస్పెన్షన్ గురించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కి మెమో జారీ చేయబడింది." అని అన్నారు.

బంజారాహిల్స్‌లోని లా అండ్ ఆర్డర్ పోలీసులు కాకుండా.. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ దాడిని నిర్వహించారు. మరోవైపు బంజారాహిల్స్‌ స్టేషన్‌ కొత్త ఎస్‌హెచ్‌ఓగా ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నియమితులయ్యారు.


నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ రెక్కీ నిర్వహించిన నెల రోజుల తర్వాత దాడులు జరగడం గమనార్హం. ఖరీదైన కార్లలో వచ్చే వారిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

5 గ్రాముల కొకైన్‌ను పోలీసులు ఎలా గుర్తించారు..?

బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 6లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లోని పుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ అనే పబ్‌ను తెల్లవారుజామున 1:40 గంటలకు తెరిచి ఉండడంతో అక్కడ భారీగా జనం ఉన్నారు. అంతేకాకుండా మరికొందరు కూడా మందు కొడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులతో కలిసి తెల్లవారుజామున 2 గంటలకు పుడ్డింగ్ & మింక్‌పై దాడి చేసి, ఆవరణలో 100 మందికి పైగా మద్యం సేవిస్తున్నట్లు గుర్తించారు. బార్ కౌంటర్‌లో డ్రింకింగ్ స్ట్రాలను ఉంచడానికి ఉపయోగించే ప్లాస్టిక్ కంటైనర్‌లలో ఒకదానిలో కొకైన్‌గా అనుమానించబడే తెల్లటి పొడిని కలిగి ఉన్న ఐదు చిన్న ప్యాకెట్లు కనుగొనబడ్డాయి.

బంజారాహిల్స్ పోలీసులు ముగ్గురు వ్యక్తులపై ఎన్‌డిపిఎస్ చట్టంలోని సెక్షన్‌లు 8(సి), 22(బి), 29(1) కింద కేసు నమోదు చేశారు. హోటల్ మేనేజర్ అనిల్ కుమార్, అభిషేక్ వుప్పాలను అరెస్ట్ చేశారు. అర్జున్ వీరమాచినేని ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారణ చేపట్టనున్నారు.

పోలీసుల ప్రకారం, పుడ్డింగ్ & మింక్ భాగస్వాములు కొంతమంది ఎలైట్ కస్టమర్లను, వారి అతిథులను మాత్రమే తమ పబ్‌కి యాక్సెస్ చేయడానికి అనుమతిస్తారు. పబ్‌ని తెల్లవారుజాము వరకు నడుపుతున్నారు. పబ్‌లో ప్రతి కస్టమర్ కోసం కోడ్‌ను రూపొందించే యాప్ ఉంది. కస్టమర్‌లు ప్రధాన ద్వారం వద్ద కోడ్‌ను చూపించడం ద్వారా మాత్రమే పబ్‌ లోకి వెళ్ళగలరు.

పోలీసులు దాడి చేసిన ప‌బ్ ఉన్న‌, ర్యాడిస‌న్ హోట‌ల్ లైసెన్స్‌ను ర‌ద్దు చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బంజారా హిల్స్ ప‌రిధిలో ఏళ్ల త‌ర‌బ‌డి కార్య‌క‌లాపాలు సాగిస్తున్న ర్యాడిస‌న్ హోట‌ల్ పై అంత‌స్తులోనే డ్ర‌గ్స్ ల‌భించిన ప‌బ్ ఉంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ర్యాడిస‌న్ హోట‌ల్ లైసెన్స్‌ను ర‌ద్దు చేసింది. ఆ హోట‌ల్‌కు ఇచ్చిన ప‌బ్‌, లిక్క‌ర్ లైసెన్స్‌ల‌ను కూడా ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

Next Story
Share it