ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

Here are routes to avoid on 23 april in view of Acharya Pre Release Event.మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం ఆచార్య‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 April 2022 5:10 AM GMT
ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం 'ఆచార్య‌'. ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో నేడు(శ‌నివారం) ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లోని యూసుఫ్‌గూడలో టీఎస్‌పీఎస్పీ 1వ బెటాలియన్‌ గ్రౌండ్‌లో నిర్వ‌హించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు, సెల‌బ్రెటీలు రానున్న నేప‌థ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

నేటి సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు అవ‌సరాన్ని బ‌ట్టి ట్రాఫిక్‌ను నిలిపివేయ‌డం లేదా మ‌ళ్లించ‌డం జ‌రుగుతుంద‌ని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్ తెలిపారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతిస్తామని చెప్పారు.

ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా..

1. మైత్రీవనం నుంచి వచ్చేవాహనాలను యూసుఫ్‎గూడ చెక్‌పోస్ట్‌ వైపునకు అనుమతించరు. సవేరా ఫంక్షన్‌ హాల్‌ నుంచి కృష్ణకాంత్‌ పార్క్‌, కళ్యాణ్‌నగర్‌ వైపు, సత్యసాయి నిగమాగమం, కమలాపురి వైపు పంపుతారు.

2.జూబ్లీహిల్స్‌ నుంచి అమీర్‌పేట వైపునకు వచ్చే వాహనాలను శ్రీనగర్‌ కాలనీ నుంచి సత్యసాయి నిగమాగమం వైపు మళ్లిస్తారు.


సందర్శకులు తమ వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్క్ చేయాలని పోలీసులు సూచించారు. మహమూద్ ఫంక్షన్ ప్యాలెస్‌ను కేవలం కార్ల పార్కింగ్ కోసం మాత్రమే కేటాయించారు. ఇక్క‌డ‌ దాదాపు 70 కార్లు పార్కింగ్ చేయవచ్చు. సవేరా ఫంక్షన్ హాల్ ఎదురుగా ఓపెన్ గ్రౌండ్‌లో ఫోర్ వీలర్, టు వీలర్ వాహనాలను పార్కింగ్ చేయ్యెచ్చు. ఇక్క‌డ దాదాపు 200 కార్లు, 700 ద్విచక్ర వాహనాలు ఇక్కడ పార్కింగ్ చేయవచ్చు. యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో టు వీలర్స్ మాత్రమే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్క‌డ దాదాపు 200 బైక్‌లు పార్కింగ్ చేయ్యొచ్చు. యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్‌లో టు వీలర్ పార్కింగ్ చేయ్యొచ్చు. ఇక్క‌డ దాదాపు 500 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసేందుకు అవకాశముంది.

ఇక.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే వ్యక్తులందరూ నిర్వాహకులు జారీ చేసిన హోలోగ్రామ్‌తో కూడిన పాస్‌లను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పాస్‌లు లేని వారిని ఈవెంట్‌కు అనుమతించరు.

Next Story