హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం.. పలు కాలనీలు జలమయం
Heavy Rains in Hyderabad.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాజధాని హైదరాబాద్‌లో
By తోట వంశీ కుమార్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాజధాని హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం నుంచి ఎడతెగకుండా కుండపోతగా వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఏకధాటిగా వాన పడింది. అమీర్ పేట్ , పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అంబర్‌పేట, గోల్నాక సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. అంబర్‌పేట పరిధి పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్‌లో ఇళ్లలోకి మురుగునీరు చేరింది. నీటమునిగిన ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో ముంపు ప్రాంతాల్లో జిహెచ్ఎంసి డిజాస్టర్ బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని నాగోల్ పరిధిలోని బండ్లగూడలో అత్యధికంగా 21.2 సెంటీమీటర్లు, వనస్థలిపురంలో 19.2 సెంటీమీటర్లు, హస్తినాపురంలో 19, భవానీనగర్‌లో 17.9, హయత్‌నగర్‌లో 17.1 సెంటీమీటర్లు, రామంతాపూర్‌లో 17.1 సెంటీమీటర్లు, హబ్సిగూడలో 16.5, నాగోల్‌లో 15.6, ఎల్బీనగర్‌లో 14.9, లింగోజిగూడలో 14.6, ఉప్పల్ మారుతినగర్‌లో 13.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు మూసారంబాగ్ వద్ద వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ వైపు నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేశారు. నాగోల్ పరిధిలోని అయ్యప్ప నగర్ కాలనీ నీట మునిగింది. మల్లికార్జున నగర్, త్యాగరాజనగర్ కాలనీల్లోకి, సరూర్‌నగర్ చెరువుకట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. కోదండరాంనగర్, సీపల బస్తీ, వీవీనగర్, కమలానగర్‌లో వరద నీరు ప్రవహిస్తున్నది.
ఛత్తీస్‌గఢ్‌పై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడింది. దీనిప్రభావంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరో 24 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.