హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపైకి పోటెత్తిన వరద.. వాహనదారులకు అలర్ట్‌

Heavy rain has been falling in greater hyderabad. హైదరాబాద్‌ మహా నగరాన్ని నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. తెల్లవారుజాము నుంచే నగర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది.

By అంజి  Published on  22 July 2022 7:17 AM GMT
హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపైకి పోటెత్తిన వరద.. వాహనదారులకు అలర్ట్‌

హైదరాబాద్‌ మహా నగరాన్ని నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. తెల్లవారుజాము నుంచే నగర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. పలు కాలనీలు పూర్తిగా నీటమునిగాయి. నాలాలు పొంగిపోర్లుతున్నాయి. ప్రధాన రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆఫీసులు, వ్యాపారాలు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేవారికి పోలీసులు పలు సూచనలు చేశారు. వర్షం ఆగిందని వెంటనే వాహనదారులు రోడ్లపైకి రావొద్దని, వర్షం ఆగిన గంట తర్వాత రోడ్లపైకి రావాలని సూచించారు. దీనివల్ల ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా ఉంటుందని తెలిపారు. అలాగే రోడ్లపై నెమ్మదిగా వెళ్లాలని చెప్పారు.

లంగర్‌హౌస్‌, గోల్కొండ, కార్వాన్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫిలింనగర్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, నాచారం, మల్లాపూర్‌, ఈసీఐఎల్‌, చర్లపల్లి, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, రామంతపూర్‌, ఉప్పల్‌, బోడుప్పల్‌, పిర్జాదీగూడ, మేడిపల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌‌, వనరస్థలిపురం, హయత్‌నగర్‌, తుర్కయంజాల్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, విద్యానగర్‌, రాంనగర్‌, సికింద్రాబాద్‌ స్టేషన్‌, కాచిగూడ, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్ కంటిన్యూ అవుతోంది. పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, నిజామాబాద్‌, జగిత్యాల, ములుగు, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు వాతావరణ శాఖ అంచనా వేసింది.

Next Story