హైదరాబాద్ మహా నగరంలో మంగళవారం ఇవాళ ఉదయం నుంచి పలుచోట్ల వర్షం కురుస్తోంది. మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. సికింద్రాబాద్, పంజాగుట్ట, గోల్కొండ, మెహదీపట్నం, కార్వాన్, నారాయణ గూడ, హిమాయత్ నగర్, అత్తాపూర్, ఉప్పరపల్లి, హైదర్‌గూడ, రాజేంద్రనగర్, గండీపేట్, శంషాబాద్, పాతబస్తీలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే సమయంలో ఇలా వర్షం కురవడంతో వాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలానే ఉంది.
హైదరాబాద్‌లోని మెయిన్ రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. దీంతో జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రహదారులపై చేరిన వర్షం నీటిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. వరద నీటిలో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటం కూడా ట్రాఫిక్ సమస్యకు మరో కారణమైంది. గత కొన్ని రోజుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉండగా.. ఇవాళ మరోసారి కురిసిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో ఏర్పడిన ఉపరితల ద్రోణి.. త్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలో కోమరీన్ ప్రాంతం వరకూ విస్తరించింది. మరోవైపు తమిళనాడుపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీగా వర్షం పడుతోంది. హైదరాబాద్‌లోనూ జోరుగా వాన పడుతోంది. రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.