గ్రీన్ ఛానెల్.. 13.46 కిలోమీటర్ల దూరం 14 నిమిషాల్లో

Green Channel from Malakpet Yashoda to Jubilee Hills Apollo.హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు మ‌రోసారి గొప్ప మ‌న‌సును

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2022 6:42 AM GMT
గ్రీన్ ఛానెల్.. 13.46 కిలోమీటర్ల దూరం 14 నిమిషాల్లో

హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు మ‌రోసారి గొప్ప మ‌న‌సును చాటుకున్నారు. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తి నుంచి సేక‌రించిన గుండెను మ‌ల‌క్‌పేట య‌శోద ఆస్ప‌త్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ రెండు ఆస్ప‌త్రుల మ‌ధ్య 13.6 కిలోమీట‌ర్ల దూరం ఉండ‌గా.. గ్రీన్ ఛానెల్ ద్వారా కేవ‌లం 14 నిమిషాల్లోనే గుండెను అక్క‌డ‌కు చేర్చారు. సాధార‌ణ స‌మ‌యాల్లో మ‌ల‌క్‌పేట నుంచి జూబ్లీహిల్స్ చేరుకునేందుకు గంట‌కు పైనే స‌మ‌యం ప‌డుతుంది.

వివ‌రాల్లోకి వెళితే.. న‌ల్ల‌గొండ జిల్లా నాగార్జున‌సాగ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో కానిస్టేబుల్ ప‌ని చేస్తున్న విజ‌య్‌కుమార్ (32) ఈ నెల 6న జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కుటుంబ స‌భ్యులు ఆయన్ను చికిత్స నిమిత్తం య‌శోద ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చారు. కాగా.. వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్ర‌క‌టించారు. విజ‌య్‌కుమార్ కుటుంబ స‌భ్యులు అవ‌య‌వ‌దానానికి ముందుకు వచ్చారు.

జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఓవ్య‌క్తి కి గుండె అవ‌స‌రం కాగా.. విజ‌య్‌కుమార్ గుండెను తీసి అత‌డికి అమ‌ర్చాల‌ని వైద్యులు నిర్ణ‌యించారు. గుండెను తీసిన కొన్ని నిమిషాల వ్య‌వ‌ధిలోనే మ‌రో వ్య‌క్తికి అమ‌ర్చాలి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో మ‌లక్‌పేట్ య‌శోద నుంచి జూబ్లీహిల్స్ అపోలో వ‌ర‌కు పోలీసులు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు.

దీనికి సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. కాగా.. ఓ వ్య‌క్తి ప్రాణం కాపాడిన పోలీసుల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

Next Story