గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండలు మండిపోతున్నాయి. నగరంలో కొనసాగుతున్న వేడిగాలుల కారణంగా నగర రోడ్లపై మధ్యాహ్నం ప్రజల రాకపోకలు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ జోన్- టిఎస్‌ఆర్‌టిసి మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల మధ్య బస్సు కార్యకలాపాలను తగ్గించాలని నిర్ణయించినట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
"వేసవి, మధ్యాహ్నం రోడ్లపై ప్రజల రాకపోకలు విపరీతంగా పడిపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని, గ్రేటర్ హైదరాబాద్ జోన్-టిఎస్‌ఆర్‌టిసి మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల మధ్య బస్సు కార్యకలాపాలను నిలిపివేస్తుంది" అని టిఎస్‌ఆర్‌టిసి ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రజల సౌకర్యార్థం బుధవారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వీ వెంకటేశ్వరులు అన్ని రూట్లలో ఉదయం 5 గంటల నుంచి ప్రారంభ ట్రిప్పులు, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్ని రూట్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళలో ప్రయాణికులకు సరిపడా బస్సులో అందుబాటులో ఉండనున్నాయి. మధ్యాహ్నం వేళ ప్రయాణం చేసే వారు ఆర్టీసీ నిర్ణయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.