బెంగళూరు స్టైల్ బ్రేక్ ఫాస్ట్.. మన హైదరాబాద్ లో..!

Grab Fresh Bengaluru style Breakfast at Hyderabad's Taaza kitchen.హైదరాబాద్ స్టైల్ దోసెలు తినీ.. తినీ.. బోర్

By M.S.R  Published on  5 March 2022 1:32 PM GMT
బెంగళూరు స్టైల్ బ్రేక్ ఫాస్ట్.. మన హైదరాబాద్ లో..!

హైదరాబాద్ స్టైల్ దోసెలు తినీ.. తినీ.. బోర్ కొడుతోందా..? కర్ణాటక స్టైల్ మసాలా దోసెలను టేస్ట్ చేయాలంటే 'తాజా కిచెన్' కు వెళ్ళండి. బెంగళూరు లో దొరికే క్రిస్పీ దోసెలు తాజా కిచెన్ లో అందిస్తున్నారు ఆ సంస్థ ఓనర్ విగ్నేష్ మన్నే. దాదాపు 25 సంవత్సరాలు బెంగళూరులో నివసించిన తర్వాత విగ్నేష్ అతడి సోదరుడు రాఘవేంద్ర బెంగళూరు స్టైల్ దోసెలు హైదరాబాద్ లో కూడా అందిస్తే బాగుంటుందని భావించారు. 2019 లో 'తాజా కిచెన్' ను మాదాపూర్ లో స్థాపించారు. అప్పటి నుండి ఫుడీస్ కు ఫేవరెట్ ప్లేస్ గా మారింది. అది కూడా అందుబాటు ధరలోనే దొరుకుతూ ఉన్నాయి. దోస, ఇడ్లీ.. ఏ వంటకమైనా తాజాగా చేసి పెడతారు. మసాలా దోసె ధర 40 రూపాయలు కాగా, ప్లేట్ ఇడ్లీ ధర 25 రూ, కాఫీ 15 రూపాయలు.

"ఒక్కో రాష్ట్రానికి.. ఒక్కో టేస్ట్ ఉంటుంది.. బెంగళూరులో లభించే దోసె ఎంతో క్రిస్పీ గానూ, చట్నీ టేస్ట్ కాస్త ప్రత్యేకంగానూ ఉంటాయి" అని విగ్నేష్ తెలిపారు. తాము అందించే గ్రీన్ చట్నీ చూసి కస్టమర్లు కన్ఫ్యూజ్ కూడా అవుతుంటారని.. కబాబ్ లలోకి ఇచ్చే పుదీనా చట్నీగా భావిస్తుంటారని విగ్నేష్ చెప్పుకొచ్చారు. తాజా కిచెన్ అందించే ప్రత్యేక గ్రీన్ చట్నీ కొత్తిమీర, కొబ్బరితో కూడిన పాత సాంప్రదాయ కర్ణాటక వంటకం. "ఈ చట్నీలో ఫైబర్ చాలా సమృద్ధిగా ఉంటుంది" అని విఘ్నేష్ చెప్పారు.


"చాలా మంది కస్టమర్లు దోసె, ఇడ్లీలకు కాంబినేషన్ గా సాంబార్ అడుగుతూ ఉంటారు. ఇడ్లీ-సాంబార్ కాంబినేషన్ అనేది తమిళనాడు స్టైల్. తాజాలో లభించే మెత్తని తాజా ఇడ్లీలకు సాంబార్ న్యాయం చేయదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను" అని ఆయన చెప్పారు.

తాజా కిచెన్ ఆహారాన్ని తాజాగా అందిస్తుంది. వంటగదిలో ఎప్పుడూ సందడి ఉంటుంది. నెయ్యితో చేసే దోసెలతో పెనం ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. మసాలా దోసె, ఇడ్లీ, కాఫీ తాజాలో బాగా అమ్ముడు పోయే ఐటెమ్స్. కాఫీ గింజల పరిమళం అన్నది కాఫీలో ఉండేందుకు గింజలను ప్రతి ఉదయం తాజాగా రుబ్బుతారు. కప్పు కాఫీ ధర కేవలం రూ. 15, వారి ఫిల్టర్ కాఫీ నిజంగా సూపర్ అనే చెప్పుకోవచ్చు.

తినే పదార్థాలలో ఫైబర్ కోసం, చాలా మంది జిమ్‌లకు వెళ్లేవారు, సైక్లిస్టులు ఇక్కడ రెగ్యులర్ గా అల్పాహారం తింటుంటారు. "నేను రోజు మార్చి రోజు అల్పాహారం తినడానికి ఇక్కడికి వస్తాను. ఇడ్లీ ఎప్పుడూ వేడిగా, చాలా మెత్తగా ఉంటుంది" అని పి. అరుణ్ అనే కస్టమర్ చెప్పారు. "చాలా టిఫిన్ సెంటర్లలో చట్నీలు బాగుండవు, ఇడ్లీ కూడా గట్టిగా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం ఇది" అని అతను తెలిపారు.

తాజాగా ఉండే హెల్తీ ఆహారాన్ని అందించడమే తమ ప్రాథమిక లక్ష్యమని విఘ్నేష్ చెప్పారు. "మేము స్విగ్గీ లేదా ఇతర ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో లేకపోవడానికి కూడా ఇదే ఒక కారణం. కస్టమర్‌కు ఆహారం చేరే సమయానికి, అది చల్లగా ఉంటుంది" అని ఆయన వివరించారు.


రెస్టారెంట్‌లో పాత్రలను శుభ్రం చేయడానికి ప్రపంచ స్థాయి స్టెరిలైజేషన్ యూనిట్ కూడా ఉంది. "ప్లేట్లు సరిగ్గా శుభ్రం చేయబడిందా లేదా అని ప్రజలు ఆందోళన చెందుతూ ఉంటారు. అందుకే, మా వంటగదిని కస్టమర్లు చూసేలా, అన్ని పాత్రలను ఎంత బాగా శుభ్రం చేస్తున్నారో తెలిపే విధంగా రూపొందించబడింది," అని విఘ్నేష్ చెప్పారు.

తాజా కిచెన్ ఎలాంటి ప్లాస్టిక్‌వేర్ లేదా పాత్రలను ఉపయోగించకుండా ఎకో-ఫ్రెండ్లీగా తీర్చి దిద్దారు. టెక్-అవే(పార్శిల్) విషయం లో కూడా ఎన్విరాన్మెంటల్-ఫ్రెండ్లీ ప్యాకేజీలను ఉపయోగిస్తారు. కస్టమర్‌లు తమ సొంత క్యారేజీలను తీసుకురావాలని ప్రోత్సహిస్తారు. సాధారణ రోజుల్లో దాదాపు 3,000-4,000 మంది ఈ కిచెన్‌ను సందర్శిస్తారు. వారాంతాల్లో, ఈ సంఖ్య 7,000-8,000 వరకు పెరుగుతుంది. ఏది ఏమైనా టేస్ట్ లో మాత్రం 'తాజా కిచెన్' హైదరాబాద్ లోనే చాలా ప్రత్యేకమైనది.

Next Story