భార్య, ప్రియురాలి మధ్య నలిగిపోయి వ్యక్తి ఆత్మహత్య
ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 1 Aug 2024 9:00 AM ISTభార్య, ప్రియురాలి మధ్య నలిగిపోయి వ్యక్తి ఆత్మహత్య
ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. సాఫీగా సాగిపోతున్న కుటుంబంలో ఇలాంటి సంబంధాలు చిచ్చుపెట్టి విషాదాలను నింపుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో కూడా ఓ సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఇల్లాలు ఉన్నా.. బయట ప్రియురాలితో చాటుమాటుగా ప్రేమాయణం సాగించాడు ఓ వ్యక్తి. ఈ ప్రేమ చివరకు అతని ప్రాణాల మీదకే తెచ్చింది. భార్య, ప్రియురాలి మధ్య నలిగిపోయి ఎవరికీ సమాధానం చెప్పుకోలేక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహ్మత్‌నగర్ లో ఈ ఘటన వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్‌నగర్‌కు చెందిన 35 ఏళ్ల వ్యక్తి రమేశ్.. ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కష్టపడి కారు డ్రైవర్‌గా పనిచేస్తూ సంపాదిస్తున్నాడు రమేశ్. వీరి సంసారం సాఫీగా సాగుతోంది. అయితే.. ఇటీవల మరో యువతితో రమేశ్‌కు పరిచయం ఏర్పడింది. తరచూ మాట్లాడుకునే వారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. భార్యా,పిల్లలు ఉన్నా ప్రియురాలిని తరచూ కలిసేవాడు. రమేశ్ ప్రియురాలితో ఫోన్ మాట్లాడుతుండగా భార్య పట్టుకుంది. ఎందుకిలా చేస్తున్నావంటూ నిలదీసింది. దాంతో.. అతను ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. ఇక ప్రియురాలిని దూరం పెట్టడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఇలాగే దూరం పెడితే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రియురాలు వీడియోలు పంపింది. భయపడిపోయిన రమేశ్ మంగళవారం ఇంట్లోని బాత్రూమ్‌లో ఉన్న యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే.. రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.