జీహెచ్‌ఎంసీ విభజన సవాల్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC)ని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన..

By -  అంజి
Published on : 17 Feb 2026 7:54 AM IST

Telangana High Court, GHMC Trifurcation, Telangana Municipalities Amendment Act 2026, GHMC Division Challenge

జీహెచ్‌ఎంసీ విభజన సవాల్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC)ని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ మున్సిపాలిటీల (సవరణ) చట్టం-2026ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు సోమవారం స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె. శ్రీనివాస్ రావులతో కూడిన ధర్మాసనం ఈ రిట్ పిటిషన్లను విచారించింది. పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత, ఈ అంశంపై ప్రభుత్వం తన వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

వ్యాపారవేత్తలు ఆర్. లక్ష్మణ్, రాజమణి రాజు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం తెచ్చిన సవరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వం), 19 (స్వేచ్ఛ) మరియు 21 (జీవించే హక్కు)లకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. 1955 మున్సిపాలిటీ చట్టం ప్రకారం, నగరం పరిధిని మార్చాలన్నా లేదా విస్తరించాలన్నా కార్పొరేషన్‌తో సంప్రదింపులు జరిపి, నోటిఫికేషన్ ద్వారా ప్రక్రియను చేపట్టాలి. తద్వారా ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత ఉంటాయి.

కొత్తగా తీసుకొచ్చిన జీహెచ్‌ఎంసీ చట్టం-2026 ద్వారా, గతంలో ఉన్న 'ముందస్తు పబ్లికేషన్' (నగర పరిమితుల మార్పుపై ప్రజల అభిప్రాయాలు కోరడం) నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఇది మున్సిపల్ పరిమితులను ఏకపక్షంగా మార్చే చర్య అని పిటిషనర్లు ఆరోపించారు. ప్రభుత్వం తన వివరణను నాలుగు వారాల్లోగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేసే ప్రక్రియలో చట్టబద్ధమైన నిబంధనలను పాటించారా లేదా అన్నది ఇప్పుడు న్యాయస్థానంలో తేలాల్సి ఉంది.

Next Story