సికింద్రాబాద్‌లోని కళాసిగూడలో మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మౌనిక మృతి చెందిన ఘటనపై జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వర్క్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణతో పాటు బేగంపేట్ డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ తిరుమలయ్యను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ ఘటనపై హైకోర్టుకు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ లేఖ రాశారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందిందని ఆయన ఫిర్యాదు చేశారు. గత నాలుగు సంవత్సరాల నుండి మ్యాన్‌హోల్ వల్ల అనేకమంది చనిపోయారని, మ్యాన్‌హోల్స్ విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చిన్నారులు చనిపోతున్నా జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. చిన్నారి మృతి కారణమైన జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు చీఫ్ జస్టీస్ కు ప్రభాకర్ లేఖ రాశారు.