GHMC: రికార్డు స్థాయిలో రూ.1,529.42 కోట్ల ఆస్తి పన్ను వసూలు

ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 10 వరకు జిహెచ్‌ఎంసి రికార్డు స్థాయిలో రూ.1,529.42 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేసింది.

By అంజి  Published on  13 March 2023 11:30 AM IST
GHMC , property tax collection

రికార్డు స్థాయిలో రూ.1,529.42 కోట్ల ఆస్తి పన్ను వసూలు

హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 10 వరకు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) రికార్డు స్థాయిలో రూ.1,529.42 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేసింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే రూ.310 కోట్లు ఎక్కువ. ఆకట్టుకునే వసూళ్లు ఉన్నప్పటికీ.. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నందున మరింత ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్‌లను ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా అధికారులకు సర్కిల్‌ల వారీగా లక్ష్యాలను నిర్దేశించి ఆస్తిపన్ను ఎగవేతదారులను గుర్తించారు.

''నోటీసులు పంపడమే కాకుండా, డిఫాల్టర్లపై చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించబడతాయి" అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా డిఫాల్టర్ జాబితాలో ఉన్నారని తెలిపారు. స్టెప్-అప్ డ్రైవ్‌లతో మార్చి 1 నుండి 10 మధ్య కేవలం 10 రోజుల్లోనే జీహెచ్‌ఎంసీ రూ.15.01 కోట్లు వసూలు చేసింది. ''ఏప్రిల్ 1, 2022 నుండి, మార్చి 10, 2023 వరకు, 12.95 లక్షల మంది ప్రజలు ఆస్తిపన్ను చెల్లించగా.. మొత్తం రూ. 1,529.42 కోట్లు వసూలయ్యాయి. రానున్న 15 రోజుల్లో ఆస్తిపన్ను కింద రూ. 400 కోట్లు వసూలు చేయాలనుకుంటున్నాం'' అని అధికారి తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో 30 జీహెచ్‌ఎంసీ సర్కిళ్ల నుంచి ఇప్పటివరకు రూ.1,529.42 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయగా, అత్యధికంగా శేరిలింగంపల్లి సర్కిల్ (రూ. 206.90 కోట్లు) జూబ్లీహిల్స్ సర్కిల్ (రూ. 154.69 కోట్లు), ఖైరతాబాద్ సర్కిల్ (రూ.122.97 కోట్లు) నుంచి ఆదాయం వచ్చింది. ఈ ఏడాది చాలా మంది ఆస్తి యజమానులు ఆన్‌లైన్‌లో పన్ను చెల్లించగా, మరికొందరు మీ సేవా కేంద్రాల ద్వారా చెల్లించారు. పలువురు ఆస్తి యజమానుల నుంచి బిల్లు కలెక్టర్లు పన్ను వసూలు చేయడమే కాకుండా జీహెచ్‌ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లను సందర్శించి చెల్లించిన వారు కూడా ఉన్నారు.

Next Story