దోమల నివారణ కోసం జీహెచ్ఎంసీ 10:10:10 క్లీనెస్ డ్రైవ్
GHMC launches 10:10:10 cleanliness drive to prevent mosquito breeding.దోమల వృద్ధిని అరికట్టడానికి, వాటి వ్యాప్తిని
By తోట వంశీ కుమార్ Published on 29 July 2022 1:34 PM ISTదోమల వృద్ధిని అరికట్టడానికి, వాటి వ్యాప్తిని నియంత్రించడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) స్వచ్ఛతా డ్రైవ్‌ను ప్రారంభించింది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు రాబోయే 10 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు 10:10:10 ని అందరూ పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు.
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వరద నీరు పూర్తిగా వెళ్లేందుకు కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. వరద నీరు క్రమంగా పోతున్నప్పటికీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ముఖ్యంగా నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు అధిక సంఖ్యలో వృద్ధి చెందుతాయి. దోమల కాటు వల్ల డెంగ్యూ, మలేరియా, మెదడువాపు మరియు చికున్‌గున్యా వంటి వ్యాధులు వస్తాయి. అందుకనే హౌసింగ్ కాలనీల చుట్టూ, బహిరంగ నీటి వనరులలో దోమల పెరుగుదలను నియంత్రించడం చాలా ముఖ్యం.
దోమలు పెరిగేందుకు ఎక్కువ అవకాశం ఉన్న 4,846 కాలనీలను జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం గుర్తించింది. ఆయా కాలనీలో దోమలు నివారణ పెరగకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. సరస్సులు, చెరువులు, ట్యాంకులలో లార్వా పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మురికి నీటిలో నూనె బంతులు వేస్తున్నారు. కాలనీలో ఫాగింగ్ చేపట్టారు.
డెంగ్యూ పెరుగుతుందనే భయం
పగటి పూట ఏడిస్ దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది. అందుకనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మంచినీరు లేదా వర్షపు నీరు ఇంటిలో, చుట్టు పక్కలా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ప్రతీ ఆదివారం ఇంట్లోని ట్రేలు, కుండలు, గిన్నెలు ఖాళీ చేసి ఆరబెట్టాలి. పాత, పారేసిన టైర్లు. పూల కుండి, ట్రేలు, పాత్రలు, పారేసిన కొబ్బరి చిప్పలు. ఎయిర్ కూలర్లు, గుంతలు దోమలు పెరిగేందుకు అనువుగా ఉంటాయి. అందుకనే వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
నియంత్రణ పద్ధతులు : 5మి.లీ టెమీ పాస్‌ను 10 లీటర్ల నీటిలో కలిపి ద్రావణాన్ని 500 మీటర్ల చుట్టూ నీరు నిలిచి ఉన్న చోట పిచికారీ చేయాలి. ఈ స్ప్రేని మురుగు కాల్వలు, వర్షపు నీటి గుంటలు, డ్రెయిన్ల దగ్గర నీటి గుంటలు, పంపులు, ట్యాంకులు మరియు రోడ్లపై నిలిచిన నీటిలో ఉపయోగించవచ్చు. ఇలా వారానికి ఒకసారి చేయవచ్చు.
జీహెచ్‌ఎంసీ కాలనీల్లో ఫాగింగ్, స్ప్రేయింగ్‌ను ముమ్మరంగా చేపట్టనుంది. చెరువులు, సరస్సుల్లో దోమల వృద్ధిని నియంత్రించేందుకు డ్రోన్లను వినియోగించనున్నారు.