ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో రీ-పోలింగ్
GHMC elections Re-polling.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మందకోడిగా కొనసాగుతున్న ఈ
By సుభాష్ Published on 1 Dec 2020 8:39 AM GMTజీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మందకోడిగా కొనసాగుతున్న ఈ పోలింగ్‌లో అక్కడక్కడ పలు ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇక ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తారుమారయ్యాయి. దీంతో అక్కడి పోలింగ్‌ను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఆ డివిజన్‌లో ఉన్న 69 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ఉంటుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. గ్రేటర్ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు కనీసం 20 శాతం కూడా పోలింగ్ శాతం నమోదు కాకపోవడం గమనార్హం. ఓల్డ్ మలక్‌పేటలో సీపీఐ ,సీపీఎం గుర్తు విషయంలో పొరపాటు జరిగినట్లు తెలుస్తోంది.
బ్యాలెట్ పత్రంపై గుర్తులు తప్పుగా ప్రింట్ కావడం వల్ల ఆ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. గుర్తుల మార్పుపై అక్కడి అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత రావాల్సిన ఎగ్జిట్‌పోల్స్‌పై కూడా నిషేధం విధించింది ఈసీ. రీపోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడికానున్నాయి. రేపే రీపోలింగ్ నిర్వహించనున్నారు.
కాగా, ఈ సారి ఎన్నికలను అన్ని పార్టీలుప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నువ్వా..నేనా అన్నట్లు ప్రచారంలో మునిగితేలిపోయారు. ఎంఐఎం గతంలో కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నప్పటికీ, ఎక్కువ చోట్ల గెలుపొందాలనే దానిపై దృష్టి సారించింది. పార్టీలన్నీ ప్రజలను ఆకర్షించేందుకు ఎంతో కృషి చేసినా ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఉత్కంఠంగా మారింది. ఈ సారి ఏ పార్టీ జెండా మేయర్ పీఠంపై రెపరెపలాడుతుందో తెలియాలంటే డిసెంబర్ 4 వరకు ఆగాల్సిందే.