జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నయా ప్లాన్.. కొత్త బేరాలతో ఓటర్లకు గాలం
GHMC election campaign.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నేతల ప్రచారం హోరా హోరీగా కొనసాగుతోంది. ఎవరికి వారే హామీలు ఇస్తూ ఓటర్లను
By సుభాష్ Published on 23 Nov 2020 4:01 PM IST- గెలుపు కోసం ఓటర్లతో అభ్యర్థుల కొత్త బేరాలు
- ఇదే సమయమని ఓటర్లతో అభ్యర్థుల ఒప్పందాలు
- అపార్టుమెంట్ల ఓటర్లకు గాలం
- జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల నయా ప్లాన్
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నేతల ప్రచారం హోరా హోరీగా కొనసాగుతోంది. ఎవరికి వారే హామీలు ఇస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకొనేలా ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వా.. నేనా అనే రీతిలో కొనసాగుతున్న ప్రచారంలో ఓటర్లను లొంగదీసుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగా ఓటర్లు సైతం నాయకులు భలే గాలం వేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన నాయకులు సైతం గంపగుత్త బేరాలు కుదుర్చుకుంటున్నారు. మా అపార్టుమెంట్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు పూర్తయింది బిల్డర్ ఇంకా కొన్ని పనులు చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడు. మిగిలిన పనులు మేం పనులు చేయించుకుంటామంటే కనీసం డబ్బులు ఇవ్వడం లేదు. అతన్ని పిలిపించి పనులు చేయించండి.. లేదా మీరే ఖర్చు పెట్టి పనులు చేయించండి. ఈ ఎన్నికల్లో మీకే ఓట్లేస్తాం.. అంటూ ఇలా అభ్యర్థులతో ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం.
ఇలా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లకు డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. విద్యావంతులు, మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా జీవించే కొన్ని కాలనీలు, అపార్టుమెంట్ల వారు అభ్యర్థుల ముందు తమ విన్నపాలు సైతం విన్నవించుకుంటున్నారు. ఓట్ల కోసం వచ్చే అభ్యర్థులను వివిధ పనులు చేయించాలని కోరుతున్నారు. లేదా తామే పనులు చేయించుకుంటామని, అందుకు డబ్బులు చెల్లిస్తే సరిపోతుందని చెప్పుకొంటున్నారు.
అలాగే ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు కాలనీలు, అపార్టుమెంట్లోకి వరద నీరు వచ్చిందని, అందుకు కారణమైన డ్రైనేజీలను బాగు చేయించాలని కోరుతున్నారు. చిన్నపాటి వర్షాలతో పలు కాలనీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఇలాంటి సమస్యలను తక్షణమే చేయంచాలని, అయితేనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తామంతా మీకే ఓటేస్తామంటూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
ఈసీఐఎల్ ప్రాంతంలో ఓ బహుళ అంతస్తు భవనంలో 70కిపైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దాదాపు 240 మంది ఓటర్లు ఉన్నారు. మరో భవనంలో 25 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అక్కడ 100 మందికిపైగా ఓటర్లున్నారు. వీరంతా తమకు ఓట్లు వేస్తే షామియానా సామాగ్రి (టెంట్) బహుమతిగా ఇచ్చేందుకు ఓ అభ్యర్థి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అలాగే సికింద్రాబాద్‌లోని ఓ అపార్టుమెంట్ సంఘం తమకు వ్యాయమశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా కుత్బుల్లాపూర్ ప్రాంతంలోని ఓ కాలనీ వాసులకు స్విమ్మింగ్‌పూల్ నిర్మించి ఇస్తానని ఓ అభ్యర్థి హామీ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ముందస్తుగా తేదీతో చెక్ కూడా అందజేస్తున్నట్లు సమాచారు. కూకట్‌పల్లి ప్రాంతంలో ఓ పాత అపార్టుమెంట్‌లో కొత్త లిఫ్ట్ ఏర్పాటు చేయిస్తే ఓట్లన్ని మీకే వేస్తామని నివాసుల సంఘం తెలియజేయడంతో ఓ అభ్యర్థి అంగీకరించినట్లు తెలుస్తోంది.
అధికంగా నివాసాలు ఉండే అపార్టుమెంట్లపై ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కనీసం 30కిపైగా కుటుంబాలు ఉండే అపార్టుమెంట్లకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు ఇచ్చేందుకు కూడా వెనుకడుగు వేయడంలేదు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముందస్తుగా ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. కొన్ని కాలనీల్లో ఏళ్లు గడిచినా పనులేవి కాకపోవడంతో పనులు చేయించుకునేందుకు ఓటర్లు సైతం అభ్యర్థులకు ఇలా గాలం వేస్తున్నారు.