Hyderabad: గాంధీ ఆసుపత్రిలో డీ-అడిక్షన్ సెంటర్ ప్రారంభం

తెలంగాణ ఆరోగ్య రంగంలో ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక జనరల్ ఆసుపత్రి (గాంధీ హాస్పిటల్) లో డీ-అడిక్షన్ (వ్యసన విముక్తి) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

By -  అంజి
Published on : 12 April 2026 7:32 AM IST

Gandhi Hospital Hyderabad, De-addiction Center, Damodar Rajanarsimha, Psychiatry Services, EAGLE System, Forensic Medicine, Drug Abuse Prevention, Telangana Health Infrastructure

Hyderabad: గాంధీ ఆసుపత్రిలో డీ-అడిక్షన్ సెంటర్ ప్రారంభం

తెలంగాణ ఆరోగ్య రంగంలో ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక జనరల్ ఆసుపత్రి (గాంధీ హాస్పిటల్) లో డీ-అడిక్షన్ (వ్యసన విముక్తి) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శనివారం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. సాధారణంగా మాదక ద్రవ్యాలకు బానిసైన వారు లేదా ఆత్మహత్యాయత్నం చేసిన వారు అత్యవసర స్థితిలో జనరల్ ఆసుపత్రికి వస్తుంటారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత వారిని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి వెళ్లమని సూచిస్తుంటారు. కానీ, చాలామంది అక్కడికి వెళ్లకపోవడంతో వారి వ్యసనం అలాగే ఉండిపోతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి గాంధీ ఆసుపత్రిలోనే ప్రత్యేక బెడ్లను కేటాయించి, అక్కడే చికిత్స అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

172 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన గాంధీ ఆసుపత్రి, ఇప్పుడు కేవలం శస్త్రచికిత్సలకు మాత్రమే కాకుండా, మానసిక ఆరోగ్యానికి కూడా పెద్దపీట వేస్తోంది. ఇక్కడ "లయేజన్ సైకియాట్రీ" (Liaison Psychiatry) విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల దీర్ఘకాలికంగా మాదకద్రవ్యాలు వాడటం వల్ల అవయవాలు దెబ్బతిన్న రోగులకు అటు శారీరక చికిత్సతో పాటు, ఇటు వ్యసనం నుండి బయటపడేందుకు మానసిక చికిత్సను ఒకే చోట అందించడం సాధ్యమవుతుంది. యువతలో వ్యసనాన్ని ఒక సామాజిక చిహ్నంగా కాకుండా, నయం చేయగల ఆరోగ్య సమస్యగా చూడాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం 'హబ్ అండ్ స్పోక్' (Hub-and-Spoke) మోడల్‌ను అమలు చేస్తోంది. దీని ప్రకారం ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య సంస్థ 'హబ్'గా వ్యవహరిస్తుంది, రాష్ట్రంలోని 35 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు 'స్పోక్' యూనిట్లుగా పనిచేస్తాయి. డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి 'ఈగిల్' (EAGLE) అనే పటిష్టమైన వ్యవస్థను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. ఎంతటి వారైనా సరే, మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తే చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున మంత్రి హెచ్చరించారు.

కేవలం వ్యసన విముక్తి మాత్రమే కాకుండా, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాన్ని ఆధునీకరించేందుకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఉస్మానియా, టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక మోర్చరీ సౌకర్యాలను కల్పిస్తున్నారు. అలాగే ఫోరెన్సిక్ మెడిసిన్‌లో నిపుణుల కొరతను తీర్చడానికి పీజీ సీట్లను పెంచాలని నిర్ణయించారు. ప్రపంచ ఫార్మా రంగంలో తెలంగాణకు ఉన్న పేరును కాపాడేందుకు, మందుల నాణ్యత విషయంలో రాజీ పడబోమని, అక్రమాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.

Next Story