ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన తర్వాత మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. టీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎంపీ కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆమె బంజారాహిల్స్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి కార్పొరేటర్ గా విజయం సాధించిన విషయం తెలిసిందే. మేయర్ పదవి కోసం బిజెపీ తరఫున ఆర్కేపురం డివిజన్ నుంచి ఎన్నికైన రాధాధీరజ్‌రెడ్డి నామినేషన్ వేయగా.. ఎన్నికల అధికారి శ్వేతామహంతి ఓటింగ్ నిర్వహించారు.
అనంతరం విజయలక్ష్మి మేయర్గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. మేయర్ ఎన్నికలో ఎంఐఎం కూడా టి.ఆర్.ఎస్ అభ్యర్థికే మద్దతు తెలిపింది. డిప్యూటీ మేయర్‌గా తార్నక కార్పొరేటర్ మోతె శ్రీలత విజయం సాధించారు. ఎంఐఎం మద్దతివ్వడంతో మేయర్, డిప్యూటి మేయర్ పదవులను టి.ఆర్.ఎస్ కైవసం చేసుకుంది.
జీహెచ్ఎంసీ నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం సందడిగా జరిగింది. తమకు అనుకూలమైన భాషలో ప్రమాణం చేసేందుకు అనుమతివ్వాలని వివిధ పార్టీలు.. అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రిసైడింగ్ అధికారి శ్వేతామహంతి నచ్చిన భాషలో ప్రమాణస్వీకారానికి అనుమతిచ్చారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో కార్పొరేటర్లు ప్రమాణం చేశారు.ఇదిలా ఉంటే మేయర్ పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దివంగత పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు.