తెలుగు ప్రజలకు సంక్రాంతి అతి పెద్ద పండుగ. అందుకనే పండుగను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునేందుకు చదువు కోసం, ఉపాధి నిమిత్తం వేరే నగరాలకు వెళ్లిన వాళ్లు సొంతూళ్లకు చేరుకుంటారు. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నగరం దాదాపుగా ఖాళీ అవుతోంది. పాఠశాలలకు, స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు, ప్రయాణీకులతో బస్సులు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా పండుగ రద్దీ కొనసాగుతోంది. టికెట్ల కోసం చాలా సమయం వృధా అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల వెతలు తీర్చేందుకు అదనంగా మరికొన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారు. సాధారణ రోజుల్లో 12 కౌంటర్లు ఉండగా అదనంగా మరో 9 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అంటే మొత్తం 21 కౌంటర్ల ద్వారా ప్రయాణీకులకు టికెట్లను అందిస్తున్నారు రైల్వే అధికారులు.
అలాగే ఏ సమయానికి ఏ రైళు వస్తుంది. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఆగుతుంది అనేది ఎప్పటికప్పుడు ప్రయాణీకులకు చెబుతున్నారు. టికెట్ తనిఖీ చేసే సిబ్బందిని 20 నుంచి 40కి పెంచారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 60 మంది ఆర్పీఎఫ్, 30 మంది జీఆర్పీ సిబ్బంది విధుల్లో ఉన్నారు.
నేడు, రేపు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
శుక్ర, శనివారాల్లో పలు ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లింగంపల్లి-హైదరాబాద్-లింగంపల్లి మధ్య నడిచే 5 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య నడిచే 11 సర్వీసులను, హైదరాబాద్-ఫలక్‌నుమా-హైదరాబాద్ మధ్య నడిచే ఓ రైలు సర్వీసును రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.