కుండపోత వర్షం.. హైదరాబాద్ అతలాకుతలం.. మరో మూడు రోజులు ఇదే జోరు
Few hours of rain bring Hyderabad to its knees. కేవలం రెండు గంటలపాటు కురిసిన వర్షం హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. నాంపల్లి, మల్లేపల్లి,
By అంజి Published on 27 Sept 2022 10:43 AM ISTకేవలం రెండు గంటలపాటు కురిసిన వర్షం హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. నాంపల్లి, మల్లేపల్లి, బేగంబజార్, ఉస్మాన్ గంజ్ అబిడ్స్ అఘాపురా, అత్తాపూర్, రాజేందర్‌నగర్ ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. నాంపల్లిలో అత్యధికంగా 9.2 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్‌లో 6.4, మెహదీపట్నంలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుపీడనం తగ్గుముఖం పట్టడంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ, హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మోజమ్‌జాహీ మార్కెట్, బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, అఫ్జల్‌గంజ్, నాంపల్లి, మెహిదీపట్నం, గుడ్డిమల్కాపూర్ మార్కెట్, టోలీచౌకి వంటి మార్కెట్ ప్రాంతాలు వర్షం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఉస్మాన్‌గంజ్‌కు చెందిన వ్యాపారి మహమ్మద్ ముక్కరం మాట్లాడుతూ.. వ్యాపార వర్గాలకు సోమవారం ఎల్లప్పుడూ కీలకమని అన్నారు. "మార్కెట్‌లో వర్షం, నీరు నిలిచిపోవడంతో పనులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. రెండేళ్ల క్రితం జిహెచ్‌ఎంసి అధికారులు ఈ ప్రాంతంలో బాక్స్ డ్రెయిన్ నిర్మించారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఆరేళ్ల క్రితం ఎదురైన పరిస్థితినే ఎదుర్కొంటున్నాం" అని అన్నారు.
నానల్‌నగర్ కార్పొరేటర్ మహ్మద్ నసీరుద్దీన్ మాట్లాడుతూ.. బల్కాపూర్ నాలా వద్ద పెండింగ్ పనుల కారణంగా టోలీచౌకి సమీపంలో నీరు నిలిచిందన్నారు. ఈ విషయాన్ని తాను మూడుసార్లు జనరల్ బాడీ సమావేశంలో లేవనెత్తానని, నాలా విస్తరణ పనులు ఇంకా ప్రారంభం కాలేదన్నారు.
జనసాంద్రత ఎక్కువగా ఉండే మల్లేపల్లిలోని దారులన్నీ జలమయమయ్యాయి. వరదలతో నిండిన రోడ్లపై చిన్నారులు ఈత కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అఫ్జల్ సాగర్ నాలా పొంగిపొర్లడంతో నీటి ఎద్దడి ఏర్పడిందని స్థానికులు తెలిపారు.
ఉప్పర్‌పల్లి అత్తాపూర్‌లోని పిల్లర్ నంబర్ 191 సమీపంలో నాలుగు అడుగుల వర్షపు నీటిలో ఆర్టీసీ బస్సుతోపాటు పలు వాహనాలు నిలిచిపోయాయి. చిన్నపాటి వర్షం కురిసినా నీటి ఎద్దడి ఏర్పడుతోందని స్థానికులు వాపోతున్నారు.
బండ్లగూడ నివాసి మహ్మద్ నూర్ మాట్లాడుతూ.. మెహదీపట్నం నుంచి అరమ్‌ఘర్ క్రాస్‌రోడ్‌కు చేరుకోవడానికి రెండు గంటల సమయం వెచ్చించాల్సి వచ్చింది.
"వర్షం వచ్చినప్పుడల్లా, ముసారాంబాగ్ వంతెన ట్రాఫిక్ కోసం మూసివేయబడుతుంది, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, అంబర్‌పేట్, కోటి, అబిడ్స్ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు" అని అక్బర్‌బాగ్‌కు చెందిన మహ్మద్ మిన్హాజ్ చెప్పారు.
పాతబస్తీలో 37 నాలా పనుల్లో 9 పనులు చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ అధికారి తెలిపారు. ఇందులో ఆరు చార్మినార్ జోన్ పరిధిలోకి, మూడు జలపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయని చెప్పారు. మిగతా ప్రాంతాల్లో 50 శాతం పనులు పూర్తయ్యాయి. పాతబస్తీలో 9 నాలాలకు గాను 7 నాలాల పనులు ప్రారంభం కాలేదు.
పాతబస్తీ వాసులు వర్షానికి సంబంధించిన ఏదైనా ఫిర్యాదు కోసం GHMC యొక్క టోల్-ఫ్రీ నంబర్లు 040-21111111, 040-29555500లను సంప్రదించవచ్చు.