హైదరాబాద్: ఆహార సంస్థ (FCI)లో అధికారిని అని నమ్మించి ఒక మహిళను పెళ్లి పేరుతో ₹1.5 కోట్లకు పైగా మోసం చేసిన వ్యక్తిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపేటలోని అలకాపురి కాలనీకి చెందిన పనస మధు (30) అనే వ్యక్తి, తాను చర్లపల్లిలోని ఎఫ్‌సీఐలో గ్రేడ్-III టెక్నికల్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు నకిలీ గుర్తింపు కార్డులు, పత్రాలను సృష్టించాడు. అతని మాటలు నమ్మిన బాధిత మహిళ కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించారు.
నిందితుడు తొలుత ₹2 కోట్ల వరకట్నం డిమాండ్ చేయగా, చర్చల అనంతరం ₹1.5 కోట్లకు ఒప్పందం కుదిరింది. నల్గొండ జిల్లాలో వీరి నిశ్చితార్థ వేడుక కూడా ఘనంగా జరిగింది. అయితే, పెళ్లికి ముందు 'ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్' పేరుతో నిందితుడు ఆ మహిళను తన ఇంటికి పిలిపించి, ఆమె క్యారెక్టర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ వేధింపులకు గురిచేశాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధితురాలు ఆరా తీయగా, అసలు విషయం బయటపడింది.
మధు ఎఫ్‌సీఐలో పనిచేయడం లేదని, అతను చూపించినవన్నీ నకిలీ గుర్తింపు కార్డులని తెలుసుకున్న బాధితురాలు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి రెండు నకిలీ ఐడీ కార్డులు, ఒక మొబైల్ ఫోన్, 'ఆన్ గవర్నమెంట్ డ్యూటీ' అని రాసి ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ తరహాలోనే మరెవరినైనా మోసం చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.