భారీ మొత్తంలో ఫేక్‌ 2వేల నోట్లు సీజ్.. నలుగురు అరెస్ట్

హైదరాబాద్‌లో ఫేక్‌ కరెన్సీ ముఠా గట్టురట్టు చేశారు పోలీసులు.

By Srikanth Gundamalla  Published on  10 Aug 2023 3:02 PM GMT
Fake Currency, Gang Arrested , Hyderabad, Police,

భారీ మొత్తంలో ఫేక్‌ 2వేల నోట్లు సీజ్.. నలుగురు అరెస్ట్

నకిలీ నోట్లను చలామణి చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 69 లక్షల పైచిలుకు నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది వ్యక్తులు వింత వింత మోసాలతో అమాయకమైన జనాలకు కుచ్చుటోపి పెడుతూ ఉంటారు. ఇటువంటి వారి మాటలు నమ్మి జనాలు వారి బుట్టలో పడిపోతుంటారు. ఓ ముఠా ఏకంగా నకిలీ నోట్లను అమాయకులతో మార్చుకోవడానికి పథకం వేశారు. కానీ చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు.

హైదరాబాద్‌లో ఫేక్‌ కరెన్సీ ముఠా గట్టురట్టు చేశారు పోలీసులు. కాలాపత్తర్ పరిధిలో కొందరు వ్యక్తులు నకిలీ కరెన్సీని.. అసలు కరెన్సీతో మార్పిడి చేసేందుకు మోసాలు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో.. పోలీసులు రెయిడ్‌ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 69.04 లక్షలు రూ.2వేల నకిలీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక నాలుగు మొబైల్‌ ఫోన్లను కూడా సీజ్ చేసినట్లు చెప్పారు పోలీసులు. నిందితులు చార్మినార్‌కి చెందిన జాహీద్ ఖాన్ (45), రాయీసుద్దీన్ (46), మహమ్మద్ అన్వర్ (36), మహమ్మద్ మునీర్ అలీ (40)గా పోలీసులు తెలిపారు. ఇక కుత్బుల్లాపూర్‌కు చెందిన ఖాజా నవీదుద్దీన్, నిజామాబాద్‌కు చెందిన షిండే ఈ ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు.

జాహీద్ ఖాన్‌కు ఖాజా నవీదుద్దీన్‌ స్నేహితుడని పోలీసులు చెప్పారు. ఇద్దరూ కలిసి అమాయకమైన జనాలను మోసం చేసి వారి వద్ద నుండి అసలు కరెన్సీని తీసుకుని నకిలీ కరెన్సీ ఇచ్చేందుకు పథకం వేశారని తెలిపారు. ఇటీవల రూ.వేల నోట్లను బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనాలు వారి వద్ద ఉన్న రూ.2వేల నోట్లను బ్యాంకుల్లోకి వెళ్లి మార్చుకుంటున్నారు. అయితే.. నిందితుల వద్ద ఉన్న ఫేక్‌ నోట్లను అమాయక జనాలకు ఇచ్చి.. అసలుగా మార్చాలని కోరుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్లాన్‌లో భాగంగానే ఖాజా నవిదుద్దీన్ నకిలీ నోట్లోను షిండే ద్వారా జహీద్ ఖాన్‌కు పంపించడం జరిగింది. అయితే ఈ నలుగురు నిందితులు ఆగస్టు 9న ఉదయం నకిలీ నోట్లను తీసుకొని అమాయకమైన జనాలను మోసం చేసి వారి వద్ద నుండి అసలైన కరెన్సీని తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే.. ఈ నకిలీ నోట్లపై "చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా" అని ముద్రించబడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 34 నకిలీ నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నకీలీ నోట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Next Story