హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.. మెట్రో తరహాలో ఇక బస్సులు
Elevated Bus Rapid Transit System to be launched from KPHB Metro to Kokapet Neopolis.విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న
By తోట వంశీ కుమార్
విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తూ.. సిగ్నల్ కష్టాలకు దాదాపు చెక్ పెట్టింది. మైట్రో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మెట్రో లైన్‌లు లేని కొన్ని మార్గాల్లోనూ మెట్రో తరహా సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రధానంగా ఐటీ సంస్థలకు వెళ్లే మార్గాల్లో.. మెట్రో రైలు తరహాలో త్వరలో ఎలక్రిక్ట్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
హైదరాబాద్ నగరంలో త్వరలో మెట్రోరైల్ తరహాలో ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఈబీఆర్‌టీఎస్) ఏర్పాటు చేస్తామని శనివారం అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు ఈబీఆర్‌టీఎస్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు చెప్పారు. రూ.2500 కోట్లతో 22 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు.
పబ్లిక్ పార్ట్‌నర్ షిప్ (పీపీపీ)- హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం)లో దీనిని చేపట్టనున్నట్లు వివరించారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ (హెచ్‌ఏఎంల్) సాయంతో హెచ్‌ఎండీఏ ఈ ప్రాజెక్టును చేపడుతుందని, టీఎస్‌ఐఐసీ కూడా ఇందులో భాగస్వామిగా ఉండనున్నట్లు తెలిపారు. కాగా.. ఈ ప్రాజెక్టు పూర్తిగా మెట్రో రైలును పోలి ఉంటుందని, ఆర్టిక్యులేటెడ్ బస్ యూనిట్లు ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో ఎలివేటెడ్ వయాడక్ట్‌పై నడుస్తాయని అధికారులు చెబుతున్నారు.
అలాగే.. నానక్‌రామ్‌గూడ-శంషాబాద్ విమానాశ్రయాల మధ్య రూ.5,100 కోట్లతో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. హైదరాబాద్‌లో రూ.3,115 కోట్లతో రెండో దశ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.