హైదరాబాద్‌లో మ్యాన్ హోల్‌లో పడ్డ ఎనిమిదేళ్ల బాలుడు
హైదరాబాద్‌లోని డ్రైనేజీలు ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. గతంలో తెరిచివున్న మ్యాన్‌హోల్స్‌లో పడి కొందరు ప్రాణాలు
By Srikanth Gundamalla Published on 14 Jun 2023 5:55 AM GMTహైదరాబాద్‌లో మ్యాన్ హోల్‌లో పడ్డ ఎనిమిదేళ్ల బాలుడు
హైదరాబాద్‌లోని డ్రైనేజీలు ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. గతంలో తెరిచివున్న మ్యాన్‌హోల్స్‌లో పడి కొందరు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులే కాదు.. పెద్దవారిని కూడా ఈ డ్రైనేజీలు మింగేశాయి. తాజాగా నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం సిద్దిక్‌నగర్‌లో ఎనిమిదేళ్ల బాలుడు మ్యాన్‌హోల్‌లో పడ్డాడు. చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ఈ ఘటన జరిగింది.ప్రమాదానికి గురైన బాలుడు సిద్దిక్‌నగర్‌లో నివాసముండే మహ్మద్ కమ్రుద్దీన్ కుమారుడు హాజిత్‌గా తెలుస్తోంది. ఇళ్ల మధ్యలో చెత్తతో నిండిపోయిన డ్రైనేజీని శుభ్రం చేసేందుకు మున్సిపల్ సిబ్బంది దాన్ని ఓపెన్ చేసి ఉంచారు. ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకుండా వదిలేశారు. తెరిచివుంచిన మ్యాన్‌హోల్‌ను గమనించని బాలుడు ఆడుకుంటూ అటుగా వెళ్లాడు. ప్రమాదవశాత్తు జారి మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు.
ఒక్కసారిగా బాలుడు మ్యాన్‌హోల్‌లో పడిపోవడంతో గట్టిగా అరిచాడు. బాలుడి కేకలు విని స్థానికులు గమనించారు. తర్వాత వెంటనే స్పందించి మ్యాన్‌హోల్‌లో పడిపోయిన బాలుడిని బయటకు తీశారు. చివరకు బాలుడు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనలో హాజిత్ తలకు గాయమైనట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాలుడు మ్యాన్‌హోల్‌లో పడిపోయిన ఘటనపై మున్సిపల్ అధికారులు స్పందించారు. సమగ్ర దర్యాప్తు జరిపిస్తున్నట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు తెలిపారు. స్థానికులు బాలుడిని గమనించకపోయి ఉంటే అతను ప్రాణాలు కోల్పోయేవాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.