హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం.. ఆరుగురు యువకులకు పాజిటివ్

హైదరాబాద్ నగరంలో మరోమారు డ్రగ్స్ కలకలం రేపింది. గోల్కొండలోని చారిత్రాత్మక తారామతి బారాదరి రిసార్టులో శనివారం అర్ధరాత్రి నిర్వహించిన...

By -  అంజి
Published on : 5 April 2026 7:01 AM IST

Hyderabad Drug Raid, Taramati Baradari Resort, Telangana EAGLE Squad, More Than Friends Event, Golconda Police Station, Drug Test Positive, Hyderabad Nightlife Policing, Narcotics Surveillance Hyderabad

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం.. ఆరుగురు యువకులకు పాజిటివ్

హైదరాబాద్ నగరంలో మరోమారు డ్రగ్స్ కలకలం రేపింది. గోల్కొండలోని చారిత్రాత్మక తారామతి బారాదరి రిసార్టులో శనివారం అర్ధరాత్రి నిర్వహించిన ‘మోర్ దెన్ ఫ్రెండ్స్’ (More Than Friends) అనే ప్రైవేట్ ఈవెంట్‌పై తెలంగాణ ఈగల్ (EAGLE) బృందం మరియు స్థానిక పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. పర్యాటక ప్రచారంలో భాగంగా ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పోలీసుల అనుమతి కోసం చివరి నిమిషంలో ప్రయత్నించినప్పటికీ, అనుమతి రాకముందే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సమాచారం. ఈ ఈవెంట్‌ను చంద్ర అనే వ్యక్తి నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.

మద్యం వినియోగానికి ఎక్సైజ్ శాఖ అనుమతి ఉన్నప్పటికీ, డ్రగ్స్ వినియోగదారుల సస్పెక్ట్ షీట్‌లో ఉన్న వ్యక్తులు ఈ పార్టీకి హాజరైనట్లు ఈగల్ డీఎస్పీ భిక్షపతికి ముందస్తు సమాచారం అందింది. దీంతో రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు రిసార్టును చుట్టుముట్టారు. ఆ సమయంలో అక్కడ 200 మందికి పైగా యువతీ యువకులు ఉన్నారు. ఎవరూ తప్పించుకోకుండా జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు, అనుమానాస్పదంగా ఉన్న 36 మందికి అక్కడికక్కడే డ్రగ్స్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో ఆరుగురికి డ్రగ్స్ వాడినట్లు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో పరం సి నిహార్, ఆశి, యోగేశ్వర్, అబ్దుల్ సర్వర్, జాసన్ అనే వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిని వెంటనే అదుపులోకి తీసుకుని గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పార్టీలో డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి? నిర్వాహకుల పాత్ర ఎంతవరకు ఉంది? అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ సంస్కృతిని అరికట్టేందుకు పోలీసులు ఇలాంటి ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించారు.

Next Story