బైక్ అంబులెన్స్.. రూపొందించిన డీఆర్డీవో.. ఐడియా అదిరింది

DRDO launches bike ambulance Rakshita. తాజాగా డీఆర్డీవో పరిశోధకులు ఓ బైక్ అంబులెన్స్ ను రూపొందించారు. సీఆర్పీఎఫ్ సూచనలతో ఈ బైక్ అంబులెన్స్ ను అభివృద్ధి చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2021 5:39 AM GMT
DRDO launches bike ambulance Rakshita

సాధారణంగా ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు లేదా అనారోగ్యం కారణంగా బాధపడుతున్న సమయంలో ఆసుపత్రికి చేరుకోవాలంటే వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేస్తాము. కానీ కొన్ని మారుమూల ప్రాంతాలకు, కొండలలో నివసించేవారికి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఈ అంబులెన్స్ సర్వీసులు అత్యవసర పరిస్థితులలో అందుబాటులో లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. దేశ రక్షణ కోసం ఆయుధాలు రూపొందించే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)ప్రజా ఉపయోగ ఆవిష్కరణలకు కూడా ప్రాధాన్యమిస్తోంది. తాజాగా డీఆర్డీవో పరిశోధకులు ఓ బైక్ అంబులెన్స్ ను రూపొందించారు. సీఆర్పీఎఫ్ సూచనలతో ఈ బైక్ అంబులెన్స్ ను అభివృద్ధి చేశారు. ఈ బైక్ అంబులెన్స్ "రక్షిత"ను నేడు ప్రారంభించారు.

మావోయిస్టు ప్రాంతాలలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా దాడి జరిగినప్పుడు తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి అంటే ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. భ‌ద్ర‌తా బ‌ల‌గాల్లో ఎవ‌రైనా గాయ‌ప‌డితే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో వారిని త‌ర‌లించేందుకు ఈ బైక్ అంబులెన్స్‌లు ఉప‌యోగిస్తారు. మావోయిస్టు ప్ర‌భావిత అట‌వీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో వినియోగించేందుకు రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ బైకుల‌కు మార్పులు చేర్పులు చేసి వీటిని రూపొందించారు.

సరి కొత్తగా రూపొందించిన ఈ అంబులెన్స్ బైక్ లను సిబ్బంది విధులు నిర్వహిస్తున్న అన్ని ప్రాంతాలలో వినియోగించనున్నట్లు సీఆర్పీఎఫ్‌ తెలిపింది. పెద్ద అంబులెన్స్‌లను అడవి లోపలికి తీసుకెళ్లడం సాధ్యం కాదని తెలిపారు సీఆర్‌పిఎఫ్ అధికారులు. ఈ అంబులెన్స్ బైకులను కేవలం జవాన్లు మాత్రమే కాకుండా, వారు విధులు నిర్వహించే ప్రాంతాలలో సాధారణ ప్రజలకు సైతం అవసరమైతే వినియోగించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ అంబులెన్సులను ప్రయోగాత్మకంగా కొన్నిచోట్ల పరిశీలించారు. సీఆర్పీఎఫ్ సూచనలతో ఈ బైక్ అంబులెన్స్‌ను రక్షణ పరిశోధన సంస్థ తయారు చేసింది.


Next Story