త్వరలో హైదరాబాదీలను థ్రిల్ చేయనున్న డబుల్ డెక్కర్ బస్సులు
Double-decker buses to thrill Hyderabadis soon. హైదరాబాద్‌లో చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్‌తో పాటు అప్పట్లో డబుల్ డెక్కర్ బస్సులకు కూడా మంచి
By అంజి Published on 20 Oct 2022 10:16 AM GMTహైదరాబాద్‌లో చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్‌తో పాటు అప్పట్లో డబుల్ డెక్కర్ బస్సులకు కూడా మంచి ఆదరణ ఉండేది. 1990ల నాటి ప్రజలు ఈ బస్సుల్లో ప్రయాణించిన మధుర జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. కానీ అధిక నిర్వహణ వ్యయం, విడిభాగాల లభ్యత లేకపోవడం తదితర కారణాలతో 2000లలో ఈ బస్సులను నిలిపివేశారు. కానీ హైదరాబాద్ మహా నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి నడపాలన్న డిమాండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ బస్సులను తిరిగి ప్రవేశపెట్టాలని పలువురు మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా అభ్యర్థించగా ఆయన సానుకూలంగా స్పందించారు.
ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను కేటీఆర్ కోరారు. హైదరాబాద్ నగరంలో మూడు వేర్వేరు రూట్లలో నడపడానికి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను లీజుకు తీసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ ఆలోచిస్తోంది. ఈ మూడు మార్గాలు ఎక్కువగా పటాన్‌చెరు-కోటి, జీడిమెట్ల-సీబీఎస్, అఫ్జల్‌గంజ్-మెహదీపట్నం. అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను నడపడానికి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించి వారం రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. బిడ్‌ను గెలుచుకున్న కంపెనీకి క్రమం తప్పకుండా ఛార్జీలు చెల్లించబడతాయి. టీఎస్‌ఆర్టీసీ రూట్‌లు, ఛార్జీలు, ఇతర పనులను ఖరారు చేస్తుంది.
ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ప్రయాణికుల రద్దీని పెంచి లాభాల వైపు పరుగులు తీసుకేందుకు అనేక చర్యల్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చుపెట్టి బస్సుల్ని కొనకుండా అద్దెకు తీసుకొని నడపడం ద్వారా భారాన్ని తగ్గించుకుంటుంది. ఇప్పటికే ముంబైలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతున్నాయి. స్విచ్ మొబిలిటీ బస్సుల్ని ముంబైలో ప్రజా రవాణా కోసం తిప్పుతున్నాయి. ఆర్టీసీ అధికారులు నిర్వహించిన సాధ్యాసాధ్యాల అధ్యయనం ప్రకారం పటాన్‌చెరు-కోఠి (218), జీడిమెట్ల-సీబీఎస్ (9X), అఫ్జల్‌గంజ్-మెహిదీపట్నం (118) రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులను నడిపే అవకాశం ఉంది.