హోర్డింగ్‌లో జాతీయ జెండాకు అవమానం
హైదరాబాద్‌లో జాతీయ జెండాకు అవమానం జరిగింది.
By Srikanth Gundamalla Published on 13 Aug 2023 10:22 AM GMTహోర్డింగ్‌లో జాతీయ జెండాకు అవమానం
హైదరాబాద్‌లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలుచోట్ల GHMC ఆధ్వర్యంలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. కానీ.. ఒక చోట ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లో జాతీయ జెండాను తిరగేసి ప్రింట్ చేయించారు. కాషాయం రంగు కింద ఉండగా.. ఆకుపచ్చ రంగును పైభాగంలో ముద్రించారు. ఏ మాత్రం చూసుకోకుండా ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా హోర్డింగ్ ఏర్పాటు చేయించిన వారిపై విమర్శలు చేస్తున్నారు.
అయితే.. మేయర్ గద్వాల విజయలక్ష్మి పేరుతో ఏర్పాటు చేయించిన హోర్డింగ్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రి కేటీఆర్, ఎంపీ కె.కేశవరావు, మంత్రి హరీశ్‌రావు తదితరుల ఫొటోలు ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నాయకులు శుభాకాంక్షలు చెబుతూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం సహజమే. కానీ ఇలా జాతీయ జెండాను అవమానించేలా ప్రింట్ చేయించడం అరుదుగా జరుగుతుంటాయి. పొరపాటున ప్రింట్ చేయించినా.. అంతపెద్ద హోర్డింగ్ పెట్టాక అయినా చూసుకోవాలి కదా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోను ఫార్వార్డ్ చేస్తూ.. విమర్శలు చేస్తున్నారు. ఇక జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే స్పందించాలని.. హోర్డింగ్‌ను తొలగించాలని చెబుతున్నారు.