హైదరాబాద్‌లో పెరుగుతున్న డెంగీ జ్వరాలు.. అధికారుల అలర్ట్

వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధులు వస్తుంటాయి.

By Srikanth Gundamalla  Published on  12 Aug 2024 4:06 AM GMT
dengue fever,  600 cases,  Hyderabad,

హైదరాబాద్‌లో పెరుగుతున్న డెంగీ జ్వరాలు.. అధికారుల అలర్ట్

వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధులు వస్తుంటాయి. ఈనేపథ్యంలోనే తెలంగాణలో ఈ మధ్య కాలంలో డెంగీ జ్వరాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్‌లో కేసులు రెట్టింపు అవుతున్నాయి. దాంతో..వైద్యాధికారులు పలు సూచనలు చేస్తున్నారు. డెంగీ జ్వరాల కారణంగా చాలా మందిలో ఒక్కసారిగా ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయనీ.. దాంతో ఆస్పత్రి పాలవుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 600 కు పైగా డెంగీ కేసులు నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ప్రయివేట్‌ ఆస్పత్రుల్లోనూ డెంగీ బాధితులు చేరుతున్నారని తెలుస్తోంది. వారి వివరాల నమోదులో తేడాలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే గ్రేట్‌ పరిధిలో వెయ్యికి పైగానే డెంగీ కేసులు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. డెంగీ ఫీవర్‌ చాలా డేంజర్. దీని బారిన పడినవారు గతంలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జ్వరాలతో చేరిన ప్రతి 10 మందిలో 3 నుంచి నలుగురు రోగులు డెంగీ బాధితులే ఉంటున్నారు. ఈ క్రమంలోనే డెంగీ బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

డెంగీ లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

టైగర్‌ దోమ కుట్టిన 4-5 రోజులకు డెంగీ ఫీవర్ లక్షణాలు కనిపిస్తాయి. 102 డిగ్రీల జ్వరం, కళ్ల వెనుక భాగంలో విపరీతమైన నొప్పి, ఒంటి నొప్పులు, ఒంటిపై ఎర్రటి దద్దర్లు ఉంటే డెంగీ జ్వరంగా అనుమానించాలి. డెంగీ జ్వరం బారిన పడ్డవారు కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. మూడు రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గకుండా లక్షణాలు కొనసాగితే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. డెంగీ లక్షణాలు కనిపించిన వెంటనే ఎన్‌ ఎస్‌ 1 యాంటిజెన్‌ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స ప్రారంభించాలి. జ్వరం వచ్చి 5 రోజులు దాటితే డెంగీ నిర్ధారణకు IGM యాంటీబాడీల పరీక్ష చేయాల్సి ఉంటుంది.

డెంగీ జ్వరం వల్ల కిడ్నీపై ప్రభావం, బీపీ తగ్గడం, వాంతులు, రక్తస్రావం, లివర్, కడుపులో నొప్పి తదితర సమస్యలు ఏర్పడితే వెంటనే అప్రమత్తం కావాలి. లేదంటే బ్రెయిన్‌ హేమరేజ్‌కు దారి తీసే అవకాశం ఉంది. డెంగీని సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే నయమవుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్లేట్‌లెట్స్ పడిపోకుండా చూసుకోవడం ద్వారా డెంగీ నుంచి బయటపడొచ్చు.

Next Story