తస్మాత్ జాగ్రత్త.. మ‌ద్యం తాగిన వారితో ప్ర‌యాణం చేసిన జైలుకే

Cyberabad Traffic Police alert.ఇక నుంచి మందుబాబుల‌తో పాటు వారి వెంట వాహ‌నంలో ఉన్న‌వారు కూడా ఊచ‌లు లెక్క‌పెట్టాల్సిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 March 2021 6:04 AM GMT
Cyberabad Traffic Police alert

ఇప్ప‌టి వ‌ర‌కు డ్రంక‌న్ అండ్ డ్రైవ్ త‌నిఖీలో మ‌ద్యం తాగి వాహ‌నం న‌డుపుతున్న వారినే ప‌ట్టుకున్నారు. వారికే శిక్ష‌లు విధిస్తున్నారు. ఇక నుంచి మందుబాబుల‌తో పాటు వారి వెంట వాహ‌నంలో ఉన్న‌వారు కూడా ఊచ‌లు లెక్క‌పెట్టాల్సిందే. తాగి వాహనం నడిపే వారినే కాకుండా.. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వారిపైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. మోటారు వాహనాల చట్టం 1988 సెక్షన్‌-188 ప్రకారం తాగి వాహనం నడిపే వ్యక్తితోపాటు ఆ వాహనంలో ఉన్నవారిపై కూడా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదుచేయనున్నారు.ఈ విషయం చట్టంలో మొదటి నుంచి ఉన్నప్పటికీ ఇంతకాలం తాగి వాహనం నడిపిన వారిపైనే కేసులు నమోదుచేసేవారు. తాజాగా రోడ్డుప్రమాద నివారణకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై కఠన చర్యలకు ఉపక్రమించిన పోలీసులు, వాహనంలోని అందరిపై కేసులు నమోదుచేస్తున్నారు. దీనిపై వాహనదారులకు అవగాహన కల్పించడానికి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. 'మీ డ్రైవర్, లేదంటే మీ స్నేహితుడు పరిమితికి మించి మద్యం తాగి కారు నడుపుతున్నాడా? పక్క సీట్లో మీరు కూడా ఉన్నారా? పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే జైలుకు వెళ్లక తప్పదు' అని ఆ పోస్టులో హెచ్చరించారు.

మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తున్నవారితో ప్రయాణిస్తూ ఎవరి మరణానికైనా కారణమైతే చట్టంలోని 304 పార్ట్‌ 2 కింద వాహనంలోని అందరికి పదేండ్లపాటు జైలు శిక్ష పడే ప్రమాదముంది.ఇప్పటికే చోటుచేసుకొన్న ఈ తరహా ప్రమాదాలపై పోలీసులు 304 పార్ట్‌ 2 కింద కేసులు నమోదుచేశారు. తస్మాత్ జాగ్రత్త!


Next Story