రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న చాలా మంది వాహనదారుల్లో మార్పు రాలేదు. ఆఫీసుకు ఆలస్యం అవుతుందనో.. మనల్ని ఎవరు పట్టుకుంటారు లే అని నిర్లక్ష్యంతోనో హెల్మెట్ లేకుండానే రోడ్డెక్కుతున్నారు. చలానానేగా కట్టేదాం అనే ధీమాతో వెలుతున్నారు. అయితే మీకు భారీ ఝలక్ తప్పదు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు నడుంబిగించారు. ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేకుండా బండి నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
ఇప్పటి వరకు హెల్మెట్ లేకుండా బండి నడిపితే.. రూ.100 చలానా విధించేవారు. అయితే.. ఇక మీదట అలా పట్టుబడితే.. మీ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను రూపొందించి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని హెచ్చరించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ తొలిసారి దొరికితే మూడు నెలలపాటు లైసెన్స్ ను రద్దు చేస్తారు. ఒకవేళ రెండోసారి కూడా అలానే దొరికితే లైసెన్స్ ను శాశ్వతంగా రద్దు చేస్తారు.
ప్రమాదాలు, హెల్మెట్ వాడకంపై విస్తృతంగా ప్రచారం చేస్తూనే నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నారు. డ్రైవింగ్ చేస్తున్నవారితో పాటుగా వెనకాల కూర్చున్న వారికి కూడా హెల్మెట్ ను తప్పనిసరి చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.