సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అయితే జాగ్రత్త..!
సంక్రాంతి పండగ వస్తే చాలు అందరూ సొంత ఊళ్లకు వెళ్తుంటారు. ఈక్రమంలోనే హైదరాబాద్ నగరం దాదాపు ఖాళీ అవుతుంది.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 3:00 PM GMTసంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అయితే జాగ్రత్త..!
సంక్రాంతి పండగ వస్తే చాలు అందరూ సొంత ఊళ్లకు వెళ్తుంటారు. ఈక్రమంలోనే హైదరాబాద్ నగరం దాదాపు ఖాళీ అవుతుంది. ఇదే అదునుగా చేసుకుంటున్నారు దొంగలు. ఊళ్లకు వెళ్లే వారిని టార్గెట్ చేసుకుని వారి ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగ కోసం సొంతూళ్లకు వెళ్తున్నవారికి పోలీసులు అలర్ట్ ప్రకటించారు. దొంగలు చోరీలకు పాల్పడుతున్న నేపథ్యంలో పలు సూచనలు చేస్తున్నారు.
సంక్రాంతి పండగ కోసం గ్రామాలకు వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ డీసీపీ నర్సింహా కొత్తపల్లి చెప్పారు. చోరీలు జరగకుండా నియంత్రించేందుకు తాము తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజల నుంచి కూడా సహకారం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ప్రజలు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ నర్సింహా తెలిపారు.
ప్రజలంతా ఇళ్లు, కాలనీలు, పరిసరాల్లో సీసీ కెమెరాలను అమర్చుకోవాలని సూచిచంఆరు. తద్వారా దొంగతనాలు జరగకుండా ఆపవొచ్చని చెప్పారు. ఇక ఇల్లు వదిలివెళ్తున్న వారు మీకు నమ్మకమైన పొరుగువారికి ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పండని సూచించారు. ఇక విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కార్లలో పెట్టడం ఏమాత్రం మంచి పని కాదని చెప్పారు. బైకులు, కార్లను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలనీ.. రోడ్లపై ఉంచొద్దని డీసీపీ నర్సింహా చెప్పారు. ఇక బీరువా తాళాలను కూడా ఇంట్లో ఉంచకుండా తమతో పాటే తీసుకెళ్లడం ఉత్తమం అని చెప్పారు. ఇంటికి తాళం వేసిన తర్వాత కనబడకుండా డోర్‌కర్టెన్ వేయడం మంచి ఆలోచన అన్నారు. ఇంట్లో చెత్తా చెదారం వేసిపోవడం వల్ల ఎవరూ ఉండని గ్రహించి.. దొంగలు చోరీలకు పాల్పడతారనీ.. అలా చెత్త లేకుండా చూసుకోవాలని సూచించారు. టైమర్‌తో కూడిన లైట్లను అమర్చుకోవాలని చెప్పారు. ఇంట్లో సీసీకెమెరాలు అమర్చితే వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. నమ్మకమైన సెక్యూరిటీ గార్డులను, వాచ్‌మెన్‌లను నియమించుకోవాలన్నారు. ఇక ప్రజలు తమ ప్రాంతాల్లో గస్తీకి సహకరించాలనీ.. పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఉంటే చోరీలను నియత్రించడం చాలా సులువు అన్నారు డీసీపీ నర్సింహా.