Hyderabad: రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, నలుగురు అరెస్ట్

నలుగురు డ్రగ్స్ వ్యాపారులను పట్టుకున్నారు పోలీసులు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 July 2024 1:44 PM GMT
cyberabad, 4 drug peddlers,  drugs seiz,

Hyderabad: రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, నలుగురు అరెస్ట్

హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పారామం సమీపంలో సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) సహకారంతో నలుగురు డ్రగ్స్ వ్యాపారులను పట్టుకున్నారు. రూ.7 కోట్ల విలువైన ఒక కేజీ హెరాయిన్ (ఒక్కొక్కటి 250 గ్రాముల నాలుగు ప్యాకెట్లు), నాలుగు స్మార్ట్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శనివారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మొహంతి వివరాలను వెల్లడించారు. నిందితులను నేమీ చంద్ భాటి (ప్రధాన డ్రగ్స్ పెడ్లర్), నర్పత్ సింగ్ (డ్రగ్ పెడ్లర్), అజయ్ భాటి, హరీష్ సిర్విలుగా గుర్తించినట్లు తెలిపారు. వీరంతా రాజస్థాన్‌కు చెందిన వారని తెలిపారు.

ప్రధాన నిందితుడు నేమీ చంద్ ప్రస్తుతం జోధ్‌పూర్ జైలులో ఉన్న కరుడుగట్టిన డ్రగ్స్ వ్యాపారి సంతోష్ ఆచారి నుంచి హెరాయిన్, ఎండీఎంఏ తీసుకున్నాడు. అతను అవసరమైన కస్టమర్లకు, ఇతర పెడ్లర్లకు విక్రయించేవాడని సీపీ తెలిపారు. నేమి చంద్ దాదాపు రెండున్నర నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చి తన బావ అజయ్ భాటి వద్దకు హెరాయిన్, ఎండీఎంఏ విక్రయించి భారీగా డబ్బు సంపాదించాలని చర్చించాడు. అజయ్ బాటి, అతని స్నేహితుడు హరీష్ సిర్వి నేమి చంద్ ఆలోచనకు అంగీకరించారు.

వారి పథకం ప్రకారం నేమీ చంద్, నర్పత్ సింగ్ నాలుగు ప్యాకెట్లలో కిలో హెరాయిన్‌తో హైదరాబాద్‌కు వచ్చి హైదరాబాద్‌లో డ్రగ్‌ను విక్రయించేందుకు అజయ్ భాటి, హరీష్ సిర్విలను కలిశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఒక కేజీ హెరాయిన్‌తో పాటు వారిని పట్టుకున్నారని సీపీ అవినాష్ మొహంతి తెలిపారు. ఇక డ్రగ్స్‌కు సంబంధించిన వివరాలను పోలీసులకు డయల్ 100 ద్వారా లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444 ద్వారా తెలియజేయాలని సీపీ ప్రజలను అభ్యర్థించారు.విద్యార్థుల కార్యకలాపాలపై ఒక కన్నేసి ఉంచాలని విద్యా సంస్థల నిర్వాహకులను ఆయన కోరారు. వివరాలను తెలిపిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు.

Next Story