మృదు మధురంగా మువ్వల సవ్వడి.. వివిధ నృత్యరూపాలను ప్రదర్శించిన 150 మంది కళాకారులు
ఒకవైపు కూచిపూడి.. మరోవైపు కథక్.. కొందరేమో భరతనాట్యం.. మరికొందరు ఆంధ్రనాట్యం.. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రశస్తి చెందిన నృత్యరూపాలన్నీ ఒక్కచోట కొలువుదీరాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు
మృదు మధురంగా మువ్వల సవ్వడి.. వివిధ నృత్యరూపాలను ప్రదర్శించిన 150 మంది కళాకారులు
- నాలుగు నాట్యరూపాల్లో 150 మందికిపైగా కళాకారుల ప్రదర్శనలు
- ఉదయం నుంచి సాయంత్రం వరకు నృత్యాలు
- నాట్యకళకు తిరిగి ప్రాణం పోశారన్న కళాకృష్ణ, వినోద్ అగర్వాల్
హైదరాబాద్: ఒకవైపు కూచిపూడి.. మరోవైపు కథక్.. కొందరేమో భరతనాట్యం.. మరికొందరు ఆంధ్రనాట్యం.. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రశస్తి చెందిన నృత్యరూపాలన్నీ ఒక్కచోట కొలువుదీరాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 20 అకాడమీలకు చెందిన 150 మందికి పైగా నృత్య కళాకారిణులు, కళాకారులు వీటన్నింటినీ అద్భుతంగా ప్రదర్శించారు. వీటన్నింటికీ బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్‌లోని సెస్ ఆడిటోరియం వేదికైంది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మువ్వలసవ్వడి ప్రతిధ్వనించింది. సాంస్కృతిక కళారూపాలకు, భారతీయ సంప్రదాయ నృత్యానికి పెద్దపీట వేసే మహోన్నత లక్ష్యంతో ఏర్పాటుచేసిన అమృత కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినోద్ అగర్వాల్, కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు గ్రహీత, ఆంధ్రనాట్య గురువు కళాకృష్ణ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఇంతమంది కళాకారులను ఒక్క చోటకు తీసుకురావడం, ఇన్ని రకాల కళారూపాలను ఒకే వేదికపై ప్రదర్శింపజేయడం ద్వారా అందరినీ అలరించడంతో పాటు.. నాట్యకళకు తిరిగి ప్రాణం పోశారని నిర్వాహకులైన అమృత కల్చరల్ ట్రస్టును వారు ప్రశంసించారు. సాయంత్రం 5 గంటలకు నిర్వహించిన అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ముందుగా న్యాయ నిర్ణేతలు శిరూషా అమర్, పద్మ దెందులూరి, వనశ్రీ ప్రొద్దుటూరు, వీణా గణేశ్, సునీలా గొల్లపూడి, సుష్మా ఉదయ్ మహంతి, చైతన్య కుసుమప్రియ.. తాము ఏయే అంశాల ఆధారంగా విజేతలను నిర్ణయించామో చెప్పారు. మొత్తం 20 అకాడమీలు పాల్గొనడం, ఒకరికి మించి మరొకరు తమ హావభావాలు, ముద్రలు, నృత్య కౌశలంతో వేదికపై అద్బుతాలు సృష్టించారని వారు ప్రశంసించారు. ముద్ర, అభియనం, బృంద స్ఫూర్తి, ప్రేక్షకుల నుంచి స్పందన, వస్త్రాలంకరణ, డిజిటల్ స్పాట్‌లైట్ లాంటి విభాగాలలో పలువురికి అవార్డులు అందించారు.
పాల్గొన్న అకాడమీలు ఇవీ..
నృత్యాంజలి కూచిపూడి నాట్యాలయం, లహరిశ్రీ నృత్యనికేతన్, నాట్య సంధ్య కూచిపూడి నృత్య అకాడమీ, ఎస్‌కేఎం ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, తరంగిణి కథక్ కేంద్ర, శ్రీ రాధికా సంగీత, నృత్య అకాడమీ, నిశృంకల నృత్య అకాడమీ, రింద శరణ్య కూచిపూడి నృత్య అకాడమీ, శ్రీదేవి నాట్యాలయ, యోగిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, కళా నృత్యనికేతన్, శారదా కళాక్షేత్ర, భావనాస్ కూచిపూడి నృత్య అకాడమీ, నృత్యజ్యోతి డాన్స్ స్కూల్, శాంకరి కూచిపూడి నృత్య, సంగీత అకాడమీ, సుమేధసెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, కళాభూమి, శ్రీ చైతన్య కూచిపూడి కళాక్షేత్రం, నృత్యకిన్నెర, ద టెంపుల్ డాన్స్, సమన్వయ డాన్స్ కంపెనీల నుంచి 143 మంది నృత్య కళాకారులు ఇందులో పాల్గొని తమ నృత్య ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు.
అమృత కల్చరల్ ట్రస్టుకు చెందిన విశాల్ ఆర్య, రేవతి పుప్పాల, సీతా ఆనంద్ వైద్యం, అనుపమ నిర్వహణ కమిటీ బాధ్యతలు చూసుకున్నారు. వారు తమ సంస్థ ఉద్దేశాలు, లక్ష్యాలను ఇలా వివరించారు.
“భారతీయ సంప్రదాయ నృత్యకళాకారులు తమ జీవితాన్నే ఈ కళకు అంకితం చేస్తారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు వారు ప్రాణం పోస్తున్నారు. ఈ కళారూపాల్లో నైపుణ్యం సాధించడం అంటే కేవలం సాధన మాత్రమే కాదు.. తనను తాను ఆవిష్కరించుకునే ఒక ఆధ్యాత్మిక తపస్సు లాంటిది. అందుకు నిబద్దత, అభినివేశం.. ఇవన్నీ అవసరం. లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ అయిన అమృత కల్చరల్ ట్రస్ట్ నృత్య కళాకారులకు తగినన్ని అవకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో ప్రారంభమైంది. సంప్రదాయ నృత్యకళ విలసిల్లేలా, కళాకారులకు తగినన్ని అవకాశాలు కల్పించేలా, వాళ్ల జీవితాలు గౌరవప్రదంగా ఉండేలా చూడాలన్నది మా లక్ష్యం. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. నృత్యాన్నే వృత్తిగా స్వీకరించే కళాకారులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. యువ కళాకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం” అన్నారు.
ట్రస్టు వ్యవస్థాపకులు రాజేష్ పగడాల, భార్గవి పగడాల మాట్లాడుతూ, “మేం ప్రతియేటా నాట్యతోరణం పేరుతో ఒక వార్షిక నృత్య పండుగ నిర్వహిస్తున్నాం. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న.. వివిధ నృత్యరీతులకు చెందిన పలువురు లబ్ధప్రతిష్ఠులైన కళాకారులు పాల్గొంటారు. ఇది కళలు సంస్కృతి, సంప్రదాయాల ఉత్సవంలా ఉంటుంది. ఇప్పుడు నిర్వహించిన మువ్వల సవ్వడి కార్యక్రమం కూడా.. దేశంలోని అన్ని కళారీతులకు ప్రాతినిధ్యం వహించింది. హైదరాబాద్‌లో ఆయా రీతుల కళాకారులకు మంచి అవకాశాలు కల్పించడం, వివిధ నృత్య అకాడమీలతో కలిసి పనిచేయడం, మరింతమందిని వీటివైపు ఆకర్షితులయ్యేలా చేయడం మా ప్రధాన ఉద్దేశం. మువ్వల సవ్వడి కార్యక్రమం ద్వారా హైదరాబాద్ నగరాన్ని శాస్త్రీయ నృత్యానికి ప్రధాన కేంద్రంగా చేయాలని భావిస్తున్నాం. ఇక్కడ చేసే ప్రతి ప్రదర్శన భారతీయ సాంస్కృతిక స్ఫూర్తిని ప్రతిధ్వనిస్తుంది” అని తెలిపారు.