దేశ వ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. ఇక సెకండ్ వేవ్‌లో జంతువులకు కరోనా సోకుతున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో మనుషుల నుంచి జంతువులకు కరోనా వ్యాప్తిపై పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా.. హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులోని 8 సింహాలకు కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే సింహాల నుంచి నమూనాలను సేకరించి సీసీఎంబీకి పంపారు.
ఇందుకు సంబంధించిన రిపోర్టులు నేడు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే గుజరాత్ గిర్ సంరక్షణ కేంద్రంలోని సింహాలకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు పార్కులను మూసివేశారు. ఆదివారం( మే 2) నుండి నెహ్రూ జూలాజికల్ పార్కులోకి సందర్శకులను అనుమతించడం లేదు.