జాతిరత్నాలు సినిమా ఇటీవల ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా మొదలైనప్పటి నుండి క్లైమాక్స్ వరకూ నవ్వులే నవ్వులు..! లాక్ డౌన్ తర్వాత భారీ హిట్ కొట్టిన సినిమాల్లో ఇది ఒకటి. జాతిరత్నాలు సినిమా సక్సెస్ ను చిత్ర యూనిట్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆ సినిమాను నిషేధించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాతిరత్నాలు సినిమాలో స్వాతంత్ర సమరయోధులను కించపరిచారని, సినిమా దర్శకుడు, నిర్మాత, నటులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బ్యాన్‌ చేయాలని అంటున్నారు శివసేన నాయకులు. శివసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమా గంగాధర్‌ సినిమాను నిషేధించాలని కోరుతూ కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు.

భూమా గంగాధర్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధులు రాంప్రసాద్‌ బిస్మిల్‌ ఉరికంబం ఎక్కే ముందు పాడిన సర్‌ ఫరోషికీ తమన్నా హబ్‌ హమారే దిల్‌ మీ హై.. కవితను జాతిరత్నాలు సినిమాలో సర్‌ ఫరోషికీ తమన్నా, సమంతా, రష్మిక, తీనోసాథ్‌ హాయ్‌.. అంటూ వెటకారంగా పాడి అవమానించారని తెలిపారు. ఇది చాలా తప్పు అని చెప్పారు. నేటి తరానికి తప్పుడు సందేశాన్ని అందిస్తోందని ఆయన చెప్పారు. సినీ రచయిత, నిర్మాత, మ్యూజిక్‌ డైరెక్టర్, కవితను ఆలపించిన వారిపై కూడా చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో శివసేన నేతలు కంజర్ల శ్రీధరాచారి, రితేష్, శ్రీనివాసాచారి, సురేష్, వేణు తదితరులు పాల్గొన్నారు. సర్‌ ఫరోషికీ తమన్నా అనే డైలాగ్ ను సినిమా ట్రైలర్లలో కూడా వాడారు. ఇక సినిమా హిట్ అయ్యి.. దాదాపుగా థియేటర్ల నుండి వెళ్లిపోయే సమయంలో ఆయన ఫిర్యాదు చేశారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story