చికెన్ బిర్యానీలో బొద్దింక.. హైదరాబాద్ రెస్టారెంట్‌కు రూ.20 వేల జరిమానా
చికెన్ బిర్యానీ పార్శిల్ నుంచి బొద్దింక బయటకు రావడంతో కస్టమర్ ఒక్కసారిగా షాకయ్యాడు. దీనిపై కస్టమర్ జిల్లా వినియోగదారుల
By అంజి Published on 2 May 2023 11:45 AM GMTచికెన్ బిర్యానీలో బొద్దింక.. హైదరాబాద్ రెస్టారెంట్‌కు రూ.20 వేల జరిమానా
హైదరాబాద్: చికెన్ బిర్యానీ పార్శిల్ నుంచి బొద్దింక బయటకు రావడంతో కస్టమర్ ఒక్కసారిగా షాకయ్యాడు. దీనిపై కస్టమర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. విచారణ అనంతరం అమీర్‌పేటలోని కెప్టెన్ కుక్ రెస్టారెంట్ కస్టమర్‌కు రూ. 20 వేలు పరిహారం చెల్లించాలని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తాజాగా ఆదేశించింది. బిర్యానీలో బొద్దింక వచ్చిన సంఘటన సెప్టెంబరు 2021లో జరిగింది. పరిశుభ్రత ప్రమాణాలను నిర్వహించడంలో విఫలమైనందుకు రెస్టారెంట్‌ను దోషిగా తేల్చింది కమిషన్.
కస్టమర్ అరుణ్.. అమీర్‌పేట్‌లోని కెప్టెన్ కుక్ రెస్టారెంట్ నుండి చికెన్ బిర్యానీ టేకావే పార్శిల్‌ను ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత పార్శిల్‌ని తీసుకుని తన పనిప్రదేశానికి చేరుకున్నప్పుడు ఆహారంలో నుండి బొద్దింక పాకుతున్నట్లు గుర్తించాడు. ఈ సంఘటన తనని ఉలిక్కిపడేలా చేసింది. అరుణ్ వెంటనే రెస్టారెంట్‌ను సంప్రదించి, ఈ సంఘటన గురించి వారికి తెలియజేశాడు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఈ విషయాన్ని జిల్లా ఫోరంకు తీసుకెళ్లారు. విచారణ సమయంలో.. రెస్టారెంట్ అరుణ్ చేసిన ఆరోపణలను ఖండించింది. భోజనం తాజాగా, వేడిగా ఉందని, ఆ ఉష్ణోగ్రత వద్ద ఒక క్రిమి జీవి సజీవంగా ఉండదని పేర్కొంది.
కానీ కమిషన్ రెస్టారెంట్ యజమానులను దోషులుగా గుర్తించింది. వారు పరిశుభ్రత ప్రమాణాలను నిర్వహించడంలో విఫలమయ్యారని ఎత్తి చూపారు. అదనంగా, అరుణ్ అందించిన వీడియోలో ఒక బొద్దింక నిజంగా ఆహారం నుండి బయటకు వచ్చిందని చూపించింది. అరుణ్‌కు నష్టపరిహారంగా రూ.20వేలు చెల్లించాలని, కేసును విచారించగా అందుకు అయిన ఖర్చులకు అదనంగా రూ.10వేలు చెల్లించాలని కమీషన్ రెస్టారెంట్‌ను ఆదేశించింది. దోషులు 45 రోజుల్లోగా జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కస్టమర్లకు ఆహారాన్ని అందజేసేటప్పుడు పరిశుభ్రత ప్రమాణాలను నిర్వహించడానికి సంస్థల అవసరాన్ని కూడా కమిషన్ నొక్కి చెప్పింది.