హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఐకానిక్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆగస్టు 4న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న శాఖలకు జారీ చేసిన మెమోలో పేర్కొన్నారు.
పోలీస్ టవర్స్ ప్రారంభోత్సవానికి ముందే అన్ని పనులను పూర్తి చేయాలని కోరారు. చారిత్రాత్మక రీతిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం సాగుతోందని చెప్పారు. లాజిస్టిక్స్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్‌కు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు. కమాండ్ సెంటర్ ప్రారంభోత్సవాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని, దీని ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రతిష్టను పెంచేలా చేయాలని, అప్పగించిన పనులను నిబద్ధతతో, ఉత్సాహంతో నిర్వర్తించాలని ఆయన తన మెమోలో తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఒకే రూఫ్ కింద వివిధ పోలీసు విభాగాల పనితీరును నెట్‌వర్కింగ్ చేయడంలో సహాయపడుతుంది. నగరంలో రాబోయే ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా ఇది ఇప్పటికే ప్రాచుర్యం పొందింది. దీనిని అందరూ పోలీస్ టవర్స్ అని పిలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9.25 లక్షల కెమెరాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి అధునాతన టెక్నాలజీతో మానిటరింగ్ చేయనున్నారు.