ఎయిర్‌పోర్ట్ మెట్రోకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన.. అధునాతన సౌకర్యాలతో నిర్మాణం

Cm Kcr Lays Foundation Stone To Metro Second Phase Works At Mind Space. హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న

By అంజి  Published on  9 Dec 2022 6:58 AM GMT
ఎయిర్‌పోర్ట్ మెట్రోకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన.. అధునాతన సౌకర్యాలతో నిర్మాణం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రెండో దశ మెట్రో దశకు అడుగులు పడ్డాయి. తాజాగా ఐకియా జంక్షన్‌ దగ్గర హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సీఎం కేసీఆర్‌ పునాది రాయి వేశారు. నాగోల్ - రాయదుర్గం కారిడార్‌-3కు కొనసాగింపుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వరకు మెట్రో నిర్మాణం జరగనుంది. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత.. హైదరాబాద్‌ నగరం నుండి విమానాశ్రయానికి ప్రయాణ సమయం తగ్గనుంది. కేవలం 26 నిమిషాల్లోనే ఎయిర్‌పోర్టు చేరుకోవచ్చు. ఇందులో మల్టీ-లొకేషన్ చెక్-ఇన్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఆదిబట్ల వద్ద ఏరోసిటీ, ప్రతిపాదిత ఫార్మా సిటీకి కీలకమైన లింక్‌గా ఉండటమే కాకుండా దక్షిణ హైదరాబాద్‌కు ప్రజా రవాణాను కూడా అందిస్తుంది. రెండో దశ మెట్రో నిర్మాణం రూ. 6250 కోట్లతో జరగనుంది. ఇది మైండ్‌స్పేస్ జంక్షన్, శంషాబాద్‌లోని హైదరాబాద్ విమానాశ్రయం మధ్య కనెక్టివిటీని అందిస్తుంది.

31 కిలోమీటర్ల పొడవైన ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ కోసం.. స్పెషల్ పర్పస్ వెహికల్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) ఏర్పాటు చేయబడింది. ఇది హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA), తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC) మధ్య జాయింట్ వెంచర్.

హెచ్‌ఏఎమ్‌ఎల్‌ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం.. హైదరాబాద్ మెట్రో రైలుతో పోల్చినప్పుడు ఈ కారిడార్ మరింత అధునాతన సౌకర్యాలను కలిగి ఉంటుంది. హాంకాంగ్ లేదా గాట్విక్ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న సేవల కంటే మెరుగైన సౌకర్యాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో.. మెరుగైన ప్రయాణీకుల భద్రత కోసం సగం ఎత్తు ప్లాట్‌ఫారమ్ స్క్రీన్ డోర్‌లను అందించనున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా కోచ్‌లు, డ్రైవర్ క్యాబ్‌లలో పొగ, ఫైర్ డిటెక్టర్లు ఉంటాయి.

ప్రయాణీకుల సౌకర్యం కోసం, ప్రతి స్టేషన్‌లో బోల్స్టర్-లెస్ బోగీలు, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్లు ఉంటాయి. విమానాల గురించి ప్రయాణీకులకు తెలియజేయడానికి, అన్ని విమానాశ్రయ మెట్రో స్టేషన్లలో ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, ఇన్ఫర్మేషన్ డెస్క్ ఉంటుంది.

ఇటీవలే హైదరాబాద్ మెట్రో రైల్ ఐదేళ్లు పూర్తి చేసుకుంది. అయినప్పటికీ, హైదరాబాద్ పాతబస్తీ వాసులు ఇప్పటికీ తమ ప్రాంతంలో మెట్రో కోసం ఎదురు చూస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో పనులు ప్రారంభించాలని గత నెలలో హైదరాబాద్ ఎంపీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తిహాద్-ఉల్-ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు (కెటిఆర్)ని కోరారు. అంతకుముందు, ఏఐఎమ్‌ఐఎమ్‌ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఎన్వీఎస్‌ రెడ్డిని కలుసుకున్నారు. ఇమ్లిబన్ బస్ స్టేషన్ నుండి ఫలక్‌నుమా వరకు పాత సిటీ మెట్రో కారిడార్ నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు.






Next Story