సిటిజన్ జర్నలిజం: సంగారెడ్డిలోని అమీన్‌పూర్‌ చెరువులో అక్రమ నిర్మాణాలు

సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ చెరువును జీవవైవిధ్య చట్టం 2002 ప్రకారం పర్యావరణ మంత్రిత్వ శాఖ నవంబర్ 2016లో 'జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం'గా ప్రకటించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 May 2024 9:15 PM IST
Citizen Journalism,  Ameenpur Lake, Sangareddy,Illegal construction

సిటిజన్ జర్నలిజం: సంగారెడ్డిలోని అమీన్‌పూర్‌ చెరువులో అక్రమ నిర్మాణాలు 

ప్రజల సమస్యలను ప్రపంచానికి తెలియజేయడంలోనూ.. సామాన్యుడికి అండగా ఉండడంలోనూ న్యూస్‌మీటర్ ఎప్పుడూ ముందు ఉంటుంది. వారి కలలను సాకారం చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించడంలో న్యూస్ మీటర్ అందరికంటే ముందు ఉంటుంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్నాం. ఈ చొరవను ముందుకు తీసుకెళ్లడానికి, మేము సిటిజన్ జర్నలిజం కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తున్నాము.. ఈ కథనం ఆ చొరవలో భాగం.

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ చెరువును జీవవైవిధ్య చట్టం 2002 ప్రకారం పర్యావరణ మంత్రిత్వ శాఖ నవంబర్ 2016లో 'జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం'గా ప్రకటించింది. ఎందుకంటే ఆ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వలస పక్షులు వస్తుంటాయి.

అయితే, ఆదిత్రి ప్రాపర్టీస్/ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్ పరిధిలోని అమీన్‌పూర్ దిగువన ఉన్న అమీన్‌పూర్ గ్రామంలోని సర్వే నంబర్‌లు 235 నుండి 247, 251 నుండి 264, 266, 267లో అక్రమంగా నిర్మాణాలు, తవ్వకాలను ప్రారంభించింది.

అలాగే, కోకాకోలా, అరబిందో ఫార్మా, ఇతర పరిశ్రమల నుండి పారిశ్రామిక వ్యర్థ జలాలు, గృహ వ్యర్థ జలాలు చెరువులోకి విడుదల చేస్తున్నారు. దీని ఫలితంగా భారీగా కాలుష్యం జరుగుతూ ఉంది.. సరస్సులో చేపలు చనిపోతున్నాయి.

చెరువుకు సంబంధించిన ఏడు ఔట్‌ఫ్లో ఛానల్స్ మూసివేశారు:

ధరణి పోర్టల్‌లో 260/1 మరియు 265/1 ప్రభుత్వ-అసైన్డ్ భూమిగా గుర్తించారు. అయితే, అన్ని సర్వే నంబర్‌లను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్న పట్టా భూమిగా వివరాలు చూపిస్తున్నాయి. అయితే, గ్రామ మ్యాప్‌లో, ఆ సర్వే నంబర్లు బఫర్ జోన్/వాటర్‌బాడీ/పెద్ద చెరువు దిగువన ఉన్నాయని స్పష్టంగా గమనించవచ్చు. అమీన్‌పూర్ సరస్సులోని కింగ్‌ఫిషర్ చెరువు ప్రాంతంలో పైన పేర్కొన్న సర్వే నంబర్లలోని నీటిపారుదల జరిగే మార్గాలన్నింటినీ మూసివేసి పూర్తిస్థాయిలో తవ్వకాలు, నిర్మాణాలు జరుగుతున్నాయని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి.

అయితే, భూమి పరిరక్షణ జోన్‌లో ఉంది. ఇది చట్టం ప్రకారం ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. ఏడు ఔట్‌ఫ్లో ఛానల్స్‌ మూసుకుపోవడంతో 149, 150 సర్వే నంబర్లలోని పట్టా భూముల నుండి పారిశ్రామిక వ్యర్థాలు చెరువులోకి ప్రవహిస్తూ ప్రజా, వ్యక్తిగత ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చెరువు బఫర్ జోన్/వాటర్ బాడీలో నాలుగు సెల్లార్లు, 10 టవర్లతో కూడిన 39 అంతస్తులను ప్రభుత్వం ఎలా అనుమతించారు? అధికారుల ఈ ఆర్డర్ 2016 OA 156, 2021 OA 192లోని NGT ఆదేశాలను ఉల్లంఘిస్తుంది. ఆర్టికల్ 21 మరియు 51 కింద ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుంది.

పాత Google Earth ఫోటోలలో జరిగిన నష్టాన్ని చూడొచ్చు:

ఈ అక్రమాలకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. గ్రామ మ్యాప్, ఇతర వివరాలకు సంబంధించి బ్యాక్‌డేట్ చేసిన Google Earth చిత్రాలు సరస్సుకు జరిగిన నష్టాన్ని స్పష్టంగా చూపుతాయి. అమీన్‌పూర్ సరస్సు భారతదేశంలో బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. పట్టణ ప్రాంతంలో ఆమోదించబడిన మొదటి జీవవైవిధ్య ప్రదేశం.

దురదృష్టవశాత్తు, HMDA రియల్ ఎస్టేట్ మాఫియాతో కుమ్మక్కై బఫర్ జోన్, అమీన్‌పూర్ సరస్సుకు అనుబంధంగా ఉన్న కింగ్‌ఫిషర్ లేక్ ప్రాంతాన్ని రెసిడెన్షియల్ జోన్‌గా మార్చింది. రియల్ ఎస్టేట్ కంపెనీ బఫర్ జోన్‌లో నిర్మాణ కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా సరస్సుకు చాలా నష్టం చేసింది. నీటిపారుదలకు సంబంధించిన ఔట్‌ఫ్లో ఛానెల్‌లను మూసివేశారు. ట్యాంక్ బండ్ ప్రాంతం లోనూ, ఔట్‌ఫ్లో ఛానెల్‌ల పైన 100 అడుగుల రహదారిని వేయాలని యోచిస్తున్నారు.

పారిశ్రామిక వ్యర్థాల నుండి రసాయన కాలుష్యం

రెరా చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో ఇప్పటికే ఫ్లాట్లను విక్రయించిన రియల్ ఎస్టేట్ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే, సదరు సంస్థ అనుమతులు లేకుండానే నిర్మాణాన్ని చేపట్టింది.

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సదరు కంపెనీపై చర్యలు తీసుకోవడం లేదు?

రచయిత: వి రవికృష్ణ- ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది, కార్యకర్త.

కథనంలోని అభిప్రాయాలు రచయితకు చెందినవి. NewsMeter సంస్థకు ప్రతిబింబించవు.

Next Story